మంచాల: వేసవి ఎండలతో ఉపాధి కూలీలకు తిప్పలు తప్పడం లేదు. నాలుగైదేళ్లుగా ప్రభుత్వం కూలీలకు టెంట్లు, పనిముట్లు సైతం అందించ లేదు. నేడు గ్రామ పంచాయతీల ద్వారా కూలీలకు పని చేసే చోట టెంట్లు, తాగునీరు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 5,100 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 1,100 మంది కూలీలు హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. పని చేసే చోట చాలీచాలని టెంట్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక ఎండలోనే పనులు చేస్తున్నామని పేర్కొంటున్నారు.
పనిముట్లు ఇవ్వాలి
గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద పని చేసే కూలీలకు గడ్డపారలు, గంపలు, ఎండలకు నీడ కోసం టెంట్లు కొత్తవి సరఫరా చేయాలి. పాతవి, చాలీచాలని టెంట్ల కింద ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే కొత్తవి ఇవ్వాలి.
– పర్వతాలు, ఉపాధికూలీ, రంగాపూర్
జీపీలకు అప్పగించాం
గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చాం. అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాం, మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం.
– వీరాంజనేయులు, ఏపీఓ, మంచాల


