అధిక లాభాల ప్రకటనలు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

అధిక లాభాల ప్రకటనలు నమ్మొద్దు

Apr 22 2026 8:42 AM | Updated on Apr 22 2026 8:42 AM

పహాడీషరీఫ్‌: రోజు రోజుకూ కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డి సూచించారు. జల్‌పల్లి శ్రీరామ కాలనీలోని సింఘానియా ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో కార్మికులకు మంగళవారం సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరగాళ్లు ముఠాలుగా ఏర్పడి సామాన్యుల పట్ల విరుచుకుపడుతున్నారన్నారు. అమాయకుల పేర్లతో సృష్టిస్తున్న మ్యూల్‌ అకౌంట్లు ప్రస్తుతం సైబర్‌ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయన్నారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో వచ్చే అధిక లాభాల ప్రకటనలను నమ్మరాదని సూచించారు. ఏ దర్యాప్తు సంస్థ వీడియో కాల్‌ ద్వారా విచారణ చేయదని, డబ్బులు అడగడదని, ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో వచ్చే బెదిరింపులకు జంకరాదన్నారు. ఏపీకే ఫైల్స్‌ లాంటి వాటిని తెరవకూడదని సూచించారు. సెక్స్‌టార్షన్‌కు దారితీసే వీడియో కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్‌ మోసానికి గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement