చెరవులు! | - | Sakshi
Sakshi News home page

చెరవులు!

Apr 22 2026 8:36 AM | Updated on Apr 22 2026 8:36 AM

చర్యలు తీసుకోవాలి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొంతమంది రియల్టర్ల ధనదాహానికి జిల్లాలోని చెరువులు, కుంటలు, వరద కాల్వలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. నిండుకుండలను తలపించాల్సినవి అక్రమార్కుల చేతుల్లో చిక్కి వట్టిపోతున్నాయి. పశు పక్షాదులు, జలచరాలతో కళకళలాడాల్సినవి బుల్డోజర్లు, జేసీబీలతో ధ్వంసం అవుతున్నాయి. నీటి వనరుల ఆనవాళ్లు కన్పించకుండా మట్టితో పూడ్చేస్తున్నారు. హైడ్రా చెరువు హద్దులు ఫిక్స్‌ చేసినా.. ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. శిఖం భూముల్లో ప్లాట్లు, భారీ విల్లాలు వెలుస్తూనే ఉన్నాయి. ఆదిబట్ల సర్వీసు రోడ్డులో భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నారు. తర్వాత చెరువు భూమిని పట్టా భూమిగా చూపించి రియల్టర్లకు అంటగట్టారు. వారు అధికారులకు ముడుపులు ముట్టజెప్పి శిఖం భూముల్లో వెంచర్ల ఏర్పాటుకు యత్నిస్తున్నారు.

కంచే చేనుమేసినట్లు..

కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు మొదలు రెవెన్యూ, ఇరిగేషన్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులంతా నిత్యం ఔటర్‌ నుంచే రాకపోకలు సాగిస్తుంటా రు. ఆదిబట్ల ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువులు, కుంటల్లో ఎత్తయిన బ్లూషీట్స్‌.. వెంచర్లు వెలుస్తున్నా, కళ్లముందే కబ్జా అవుతున్నా.. కట్టలు, కాల్వలు ధ్వంసం అవుతున్నా.. సర్వీసు రోడ్డు నుంచి వెంచర్‌లోకి అక్రమంగా బీటీ రోడ్డు వేసినా పట్టించుకోలేదు. కంచే చేను మేసినట్లు జిల్లా అధికార యంత్రాంగమే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మచ్చుకు కొన్ని ఆక్రమణలు

● మాడ్గుల మండలం గిరికొత్తపల్లి, అప్పారెడ్డి గ్రామాల్లోని చెరువుల్లో ఆక్రమణలు ఆగడంలేదు. కొంతమంది రియల్టర్లు శిఖం భూములు కొనుగోలు చేసి తూములను ధ్వంసం చేశారు. చెరువులను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయినా ఆక్రమణల విధ్వంసం మాత్రం ఆగలేదు.

● ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లి రెవెన్యూ మర్రిగూడంకుంట కట్టపై కొంతమంది రియల్టర్లు కన్నేశారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలు పెట్టి చదును చేశారు. కట్ట ఆనవాళ్లు లేకుండా చేశారు.

● కొంగరతండా సమీపంలోని దాతూర్‌కుంట కట్టను ధ్వంసం చేశారు. కట్ట ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. కళ్లముందే విధ్వంసం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు.

● రావిర్యాల నుంచి కొంగర వెళ్లే మార్గంలో ఓ కన్వెన్షన్‌ నిర్వాహకులు ఏకంగా పులిందర్‌వాగును కబ్జా చేశారు. వాగుకు అడ్డుగా మట్టిపోసి చిన్న పైపులు వేశారు.

ఆగని ఆక్రమణల పర్వం

శిఖం భూముల్లో వెంచర్లు

కట్టలు, అలుగులు ధ్వంసం

ఆనవాళ్లు కోల్పోతున్న తటాకాలు

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

ఇది ఆదిబట్ల ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డుకు ఆనుకుని ఉన్న జిలాల్‌ఖాన్‌ చెరువు. సర్వే నంబర్‌ 123,124,125,434,439,44,441,442,444లలో 24.32 ఎకరాల విస్తీర్ణంలో ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌ విస్తరించి ఉంది. కొంత మంది రియల్టర్లు ఇక్కడ భారీ వెంచర్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే సర్వీసు రోడ్డు నుంచి వెంచర్‌లోకి బీటీ రోడ్డు, చుట్టూ బ్లూషీట్స్‌ వేశారు. టిప్పర్ల కొద్ది మట్టిని తెచ్చి చెరువు శిఖాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు.

మహేశ్వరం నుంచి తుమ్మలూరు వెళ్లే మార్గంలో ఊరచెరువు ఉంది. అలుగు కింది భాగంలోని తరిపొలంలో ఓ రియల్టర్‌ వెంచర్‌ చేస్తున్నారు. నిత్యం వరదలు ముంచెత్తే లోతట్టు ప్రాంతాల్లో వెంచర్‌ ఏర్పాటుకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఎన్‌ఓసీలు ఎలా జారీ చేశారో మరి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అక్రమ వెంచర్లకు తప్పుడు ఎన్‌ఓసీలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

– ఎల్మ మోహన్‌రెడ్డి, మహేశ్వరం

Advertisement
 
Advertisement
Advertisement