● బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం
● తండ్రీకొడుకుల దుర్మరణం
● తల్లీకూతురుకు తీవ్ర గాయాలు
● వండర్‌లా వద్ద ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: మొక్కు తీర్చుకునేందుకు ఆలయానికి వెళ్తున్న ఓ కుటుంబంపై మృత్యువు పంజా విసిరింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు చనిపోగా, తల్లీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. సాహెబ్‌గూడ ప్రాంతంలో నివాసం ఉండే కొమ్మగోని ప్రశాంత్‌గౌడ్ విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం భార్య వాణి, కుమారుడు శ్రీతన్, కూతురు శశికళతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు బైక్‌పై రావిర్యాల సమీపంలోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి వెళ్తున్నారు. వండర్‌లా వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన ఓ డీసీఎం వీరిని ఢీకొట్టింది. బైక్‌పై ముందు కూర్చున్న శ్రీతన్ ఎగిరి కొద్ది దూరంలో పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డు పక్కన పడిపోయిన ప్రశాంత్‌గౌడ్ (41) రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. వాణి (38)కి కాలు విరిగిపోగా, శశికళ (10) సైతం గాయాలపాలైంది. కొన ఊపిరితో ఉన్న శ్రీతన్ (11) అస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తల్లీకూతుళ్లను మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రీకుమారుడి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.


