రెగ్యులర్ ఆఫీసర్లు లేక నీరుగారుతున్న లక్ష్యం
క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం
కొరవడుతున్న పర్యవేక్షణ
కుంటుపడుతున్న పాలన
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముఖ్యమైన శాఖలకు జిల్లాలో రెగ్యులర్ ఉన్నతాధికారులు కరువయ్యారు. ఒక్కో అధి కారికి రెండు మూడు శాఖల బాధ్యతలు అప్పగిస్తుండడంతో పరిపాలన కుంటుపడుతోంది. సంక్షే మ పథకాల అమల్లోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి ఏరోజు ఏ ఆఫీసుకు వెళ్తున్నారో.. ఏ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి. ఏదైనా సమస్య పరిష్కారం కోసం సగటు వ్యక్తి సంబంధిత ఆఫీసుకు వెళ్లి ఆరా తీస్తే.. అక్కడి అటెండర్ల నుంచి సార్/ మేడం ఫీల్డ్ విజిట్‌లో ఉన్నారన్న సమాధానం వస్తోంది. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా సంబంధిత అధికారులు కన్పించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పరి పాలనలో పారదర్శకత, సత్వర సేవలు అందాల్సిన చోట ఆరోపణలు మూటగట్టుకోవాల్సి వస్తోంది.
సమస్యల వెల్లువ
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఏడాదికిపైగా ఇన్‌చార్జి గుప్పిట్లోనే మగ్గుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతిమాసింగ్ కొంతకాలం మెటర్నిటీ లీవ్‌లో వెళ్లారు. ఆ పోస్టులో యూఎల్‌సీ ఎస్‌డీసీ శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మెటర్నిటీ లీవ్ ముగియడంతో సుదీర్ఘకాలం తర్వాత ఫిబ్రవరి 20న తిరిగి విధుల్లో చేరిన ఆమె వెంటనే కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిపోయారు. ఈ పోస్టు మళ్లీ ఖాళీ అయింది. అప్పటి వరకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన శ్రీనివాస్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంక్షే మ పథకాల అమలు తీరు తెన్నులతో పాటు విద్య, వైద్యం, సంక్షేమ హాస్టళ్ల పని తీరును పర్యవేక్షించే కీలక విభాగానికి రెగ్యులర్ అధికారి లేక ఇబ్బందిగా మారింది. సంక్షేమ హాస్టళ్లలో తలెత్తుతున్న సమస్యలు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, టౌన్‌ప్లానింగ్‌లో అక్రమార్కులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
సీ్త్ర, శిశు వికాసం ఏదీ ?
సీ్త్ర, శిశు వికాస, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. డీఆర్‌డీఏ పీడీ శ్రీలతకు ఈ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. 1,602 అంగన్‌వాడీ కేంద్రాలు సహా వీటి ద్వారా 20,030 మంది గర్భిణులు, బాలింతలు, 79,817 మంది ఆరేళ్లలోపు పిల్లలకు సంపూర్ణ పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు ఈ శాఖ పర్యవేక్షణలోనే కొనసాగుతుంటాయి. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేస్తున్న కేసులు కూడా ఈ విభాగమే చూస్తోంది. దివ్యాంగుల సంక్షేమం సైతం పర్యవేక్షించాల్సి ఉంది. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాల పనితీరును కూడా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇలాంటి కీలక విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టు ఇన్‌చార్జి గుప్పిట్లో మగ్గుతోంది. కీలక అధికారి లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది.
కొరవడిన ‘ప్రజా సంబంధాలు’
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా ప్రజా సంబంధాల విభాగంపై ఉంది. ఇక్కడ డీపీఆర్‌ఓగా పని చేసిన వెంకటేశం నాలుగు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ బాధ్యతలను అడిషినల్ పీఆర్‌ఓకు అప్పగించారు. కలెక్టర్ వివిధశాఖలతో నిర్వహించే సమీక్ష సమావేశాలు, ప్రకటనల జారీ కీలకంగా వ్యవహరించాల్సిన ఈ విభాగం ఇన్‌చార్జిల పాలనలో కొనసాగు తోంది. ఇక్కడ పని చేస్తున్న వారికి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేదు. దీనికి తోడు ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ లేమి కారణంగా ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాల్సిన ప్రజా సంబంధాల విభాగం అటు జిల్లా ఉన్నతాధికారులకు, ఇటు మీడియా ప్రతినిధులకు దూరమవుతోందనే విమర్శ సైతం లేక పోలేదు.
డీఆర్ లేక డీలా
జిల్లాలో 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఒక్కో ఎస్‌ఆర్‌ఓ పరిధిలో రోజుకు సగటున 50 నుంచి 60 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెట్టే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగానికి రెగ్యులర్ అధికారి లేకపోవడం ఇబ్బందిగా మారింది. పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్‌గా పని చేసిన సంతోష్‌పై ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఆయన స్థానంలో డీఐజీ స్థాయి అధికారికి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. కీలకమైన ఈ విభాగానికి రెగ్యులర్ అధికారి లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయిలోని ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రధాన శాఖలన్నింటికీ అదనపు అధికారులే గతి


