హుడాకాంప్లెక్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి సమ్మర్ కోచింగ్ నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్‌బాల్, లాన్‌టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాక్సింగ్, కబడ్డీ, కరాటే, టేబుల్‌టెన్నిస్ క్రీడా విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అనుభవజ్ఞులైన కోచ్‌లతో క్రీడల్లో నైపుణ్యాలు నేర్పించనున్నట్టు చెప్పారు. వివరాలకు స్టేడియంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ కోసం రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జనగణన పక్కాగా
నిర్వహించాలి
చేవెళ్ల: జాతీయ జనగణనను పక్కగా, పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని వివేకానంద కళాశాలలో జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో అత్యంత కీలక ప్రక్రియ అయిన జనగణనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మండలాలు, మున్సిపాలిటీల వారీగా సర్వేలో పా ల్గొనే ఉద్యోగులకు శిక్షణ కొనసాగుతున్నట్టు పే ర్కొన్నారు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలి.. ఎలా పరిష్కరించాలనే విషయాలను తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట చేవెళ్ల మున్సి పల్ క మిషనర్ వెంకటేశం, మాస్టర్ ట్రైనర్లు శివరాం, విజయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆ కళాశాలపై
చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం: విద్యార్థి మరణానికి కారణమైన శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాల గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఫీజు చెల్లించాలని వేధింపులకు గురిచేయడంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి ప్రణిత్ తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వదలిపెట్టారు.
సింగూర్, మంజీరా నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి,సిటీబ్యూరో: నగరవాసుల గొంతు తడుపుతున్న సింగూర్, మంజీరా జలాశయాల నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంప్‌హౌస్‌లు ఉన్న ప్రాంతాల్లో గాలి, దుమారానికి చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడుతుండటంతో పంపింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జలమండలి ఒక ప్రకటనలో తెల్పింది. కనీసం 15 నుంచి 30 నిమిషాలపాటు కొనసాగే స్వల్పకాలిక విద్యుత్ అంతరాయాలు కూడా మంజీరా పంపింగ్ స్టేషన్ల కార్యకలాపాలను గణనీయంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. ఆదివారం జరిగిన విద్యుత్ అంతరాయం కారణంగా సుమారు 7 గంటలపాటు పంపింగ్ నిలిచిపోయినట్లు తెలిపింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి స్పష్టం చేసింది.


