గచ్చిబౌలి టీఎన్‌జీవోస్ జేవీ ప్లాజాలో అగ్నిప్రమాదం
● ప్యానల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్
● 24 ఫ్లాట్లు.. ఫైర్ సేఫ్టీ శూన్యం
● సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 90% గాయాలు
● పది మందికి తీవ్ర అస్వస్థత, బైక్‌లు దగ్ధం
గచ్చిబౌలి: సెట్ బ్యాక్స్ లేవు.. ఫైర్ సేఫ్టీ శూన్యం..! ఫలితం.. ఓ నిండు ప్రాణం ప్రమాదంలో పడింది. మరో 10 మందికి తీవ్ర అస్వస్థత! 10 బైక్‌లు బూడిదయ్యాయి. ఇదీ.. గచ్చిబౌలి టీఎన్‌జీవోస్ కాలనీలోని జేవీ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం పర్యవసానం. డీఐ పి.నరేష్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... సోమవారం ఉదయం జేవీ ప్లాజా సెల్లార్‌లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్‌తో సోఫాకు మంటలు అంటుకున్నాయి. వాచ్‌మేన్ నజీర్ అపార్ట్‌మెంట్ లోనివారిని అప్రమత్తం చేశాడు. ఈలోగా బైక్‌లకు మంటలు అంటుకున్నాయి. మొదటి అంతస్తుకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. మాదాపూర్, వట్టినాగులపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, అగ్ని ప్రమాదంలో ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం చిన్న గొన్నూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గాజుల రాజశేఖర్‌బాబు (25) శరీరం 90 శాతం కాలిపోయింది. ఇతడు జేవీ ప్లాజా ఫ్లాట్ నంబర్ 202లో ఉంటూ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. రాజశేఖర్‌కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసింది. తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ అమూల్య (34), ప్రణీత్ (22), హర్షిల, పంకజ్ జిందాల్ (37), సోనమ్‌జాడోన్ (35), శిల్పా పాండే (24), ఆది పవన్ కుమార్ (25), అరివ్ కే తన్ (7 నెలలు), రాజేష్ (24), వెంకట్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గదులలో ఉన్న 16 మందిని కాపాడారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు.
నో ఫైర్ సేఫ్టీ
సుమిత్‌రెడ్డికి చెందిన జేవీ ప్లాజాలో 24 ఫ్లాట్స్ ఉన్నాయి. 8 డబుల్, 8 సింగిల్ బెడ్‌రూమ్స్ కాగా, 8 సింగిల్ రూమ్స్ అద్దెకిచ్చారు. రాజేందర్‌రెడ్డి ఈ అపార్ట్‌మెంట్‌ను లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెలకు రూ.5 లక్షలకు పైగానే అద్దె వసూలు చేస్తున్నా ఫైర్ సేఫ్టీ పాటించడం లేదు.


