అనంతగిరి: అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఎకో టూరిజంతో రూపురేఖలు మారబోతున్నాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం అనంతగిరి గుట్టలో అర్బన్ పార్క్, వాచ్ టవర్, అనంతగిరి పర్యావరణ పట్టణ ఉద్యాన వనం పనులను.. అటవీ అతిథి గృహంలో డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ దీ బ్రీజ్‌ను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి.సువర్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీంతో యువతకు ఉపాధి అవకా శాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతగిరి కొండల్లో వివిధ ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నందున పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మూసీ నది జన్మస్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సునీత భగవత్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (చార్మినార్ సర్కిల్) ప్రియాంక వర్గీస్, టూరిజం వింగ్ డైరెక్టర్ రంజిత్ నాయక్, కలెక్టర్ దీపక్ తివారి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


