మూడేళ్ల బాలుడు దుర్మరణం
శంకర్‌పల్లి: ఓ కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం శంకర్‌పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఇంద్రారెడ్డి నగర్‌కి చెందిన మల్లేశ్(38), తన కుమారుడు ప్రదీప్(3), బావమరిది రాజుతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం టాటా గూడ్సు ఆటోలో శంకర్‌పల్లికి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ రాఘవేంద్రస్వామి ఆలయం సమీపంలో ఉండగా.. మండల పరిధిలోని కొండకల్ గ్రామానికి చెందిన గట్టు ప్రభాకర్ అతివేగం, అజాగ్రత్తగా కారుతో ఆటోని ఓవర్‌టెక్ చేయబోయి బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆటోలోని వారంతా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో మూడేళ్ల ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందగా.. మల్లేశ్, రాజు, కారు డ్రైవర్ ప్రభాకర్ గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


