సాక్షి, సిటీబ్యూరో: మీడియా రంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2026 (6వ ఎడిషన్)ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 2న హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నామన్నారు.ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ మీడియా విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్‌మెంట్, సర్క్యులేషన్ వంటి కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 50కి పైగా విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నలుగురు ప్రముఖ జర్నలిస్టులకు లెజెండరీ పురస్కారాలు అందజేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏప్రిల్ 26లోపు 8096974747 వాట్సాప్ నంబర్‌కు పంపించాలన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు రూ.2.5లక్షల విలువైన స్కాలర్‌షిప్స్ అందజేస్తామన్నారు.
జలమండలికి అవార్డులు
సాక్షి,సిటీబ్యూరో: జలమండలి దక్కించుకున్న మూడు పీఆర్‌ఎస్‌ఐ అవార్డులను సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డికి అందించారు. రాష్ట్రీయ స్థాయిలో బెస్ట్ బ్రోచర్, కార్పొరేట్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, బెస్ట్ లేఅవుట్, డిజైన్ కేటగిరీలో పోస్టర్ కేటగిరీల్లో జలమండలి బహుమతులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) ద్వారా అందుకున్న అవార్డులను ఎండీకి అందజేశారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, రాజ శేఖర్, పీఆర్వో సుభాష్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ పర్ట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనసూయపై అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో నటి అనసూయ భరద్వాజ్‌ను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటిగా గుర్తించామని డీసీపీ టి.సాయి మనోహర్ సోమవారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పలువురు వ్యక్తులు సోషల్‌మీడియా పేజీల్లో నటి అనసూయ భరద్వాజ్‌పై అనుచిత, అసభ్యకర పోస్టు చేస్తున్నారు. దీనిపై అనసూయ ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు చంటిని అరెస్టు చేశారు. ఇతడు తన ఇన్‌స్టా ఖాతాలో అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు గుర్తించారు.
మద్యం మత్తులో నగ్నంగా తిరుగుతూ..
రాజేంద్రనగర్ వ్యక్తి అరెస్ట్
మలక్‌పేట: అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి నగ్నంగా తిరిగిన వ్యక్తిని మలక్‌పేట పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ కుంభం నర్సింహ తెలిపిన మేరకు.. రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ షాద్ నక్వి(45) సెకెండ్ హ్యాండ్ కార్ బిజినెస్ చేస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి అధిక మోతాదులో మద్యంతాగి తెల్లవారుజామున కారులో నగ్నంగా మూసారంబాగ్ డివిజన్ గంగాధర అపార్ట్‌మెంట్‌లో చొరబడి తలుపుల్లో చూస్తున్నాడు. దీంతో స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించగా కారులో వెళ్లిపోయాడు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర్‌రెడ్డి కేసున మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా అతనిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.
గురుకుల పాఠశాల తనిఖీ
యాలాల: మండల పరిధి కోకట్ శివారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని పంచాయతీరాజ్ తాండూరు డీఈఈ నాగభూ షణం సోమవారం తనిఖీ చేశారు. సామగ్రి, సరుకుల వివరాలు, కూరగాయల నాణ్యత, ఆర్‌ఓ ప్లాంట్ పనితీరును పరిశీలించారు. మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణ, ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు.. ఆహారం విషయంలో రాజీ పడొద్దని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి ఉన్నారు.


