బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌

వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌

తాండూరు: మహిళా బిల్లు ఆమోదం కాకుండా బీజేపీ కుట్ర చేసి నెపం కాంగ్రెస్‌ పార్టీపై మోపుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ ధ్వజమెత్తారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా బిల్లులో డీ లిమిటేషన్‌ బిల్లును కలిపి పెట్టడంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు 2023లోనే పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆమోదం తెలిపిందన్నారు. 2026 –27లో జరిగే జనగణన తర్వాత మహిళా బిల్లు అమలు చేస్తామన్నారు. 2011 జనగణన ప్రకారం డీ లిమిటేషన్‌ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం తీరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగానే బిల్లును వ్యతిరేకించినట్లు వివరించారు. బీజేపీ నాయకులు మాత్రం మహిళా బిల్లును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించిందని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు పెడితే కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా ఆమోదం తెలుపుతుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల నర్సింహులు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శోభారాణి, కావలి సంతోష్‌, అధికార ప్రతినిధి కలాల్‌ చంద్రశేకర్‌, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌ గౌడ్‌, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌కు ఆ స్థాయి లేదు

ధారూరు: ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మి రెండు సార్లు అధికారం కట్టబెడితే కుంభకోణాలతో కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ ఆరోపించారు. ఇలాంటి పార్టీకి కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి లేదని హితవు పలికారు. సోమవారం మండలంలోని ఎబ్బనూర్‌, అల్లిపూర్‌, హరిదాస్‌పల్లి, చింతకుంట, స్టేషన్‌ధారూరులో పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నాయకులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూముల వివరాల్లో కాస్తు కాలం తొలగించి ఏళ్ల తరబడి అనుభవిస్తున్న పేదల పొలాలను కొల్లగొట్టారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. అది చూసి ఓర్వలేక అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి మహ్మద్‌ బాబాఖాన్‌, సోషల్‌ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి చామల రఘుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, నాయకులు హరిచంద్‌, బుజ్జయ్యగౌడ్‌, తిరుపతయ్య, హన్మయ్య, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement