పాఠశాలల వద్ద పొగాకు దందా | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల వద్ద పొగాకు దందా

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయానికి చెక్‌ చెప్పడానికి నగర పోలీసులు ‘ఆపరేషన్‌ సేఫ్‌ స్కూల్‌’ పేరుతో తనిఖీలు చేశారు. శనివారం నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పాన్‌డబ్బాలు, కిరాణా దుకాణాల్లో సోదాలు చేసిన అధికారులు 567 కేసులు నమోదు చేసి, రూ.1.1 కోటి విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్‌ చేసినట్లు కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువతను డ్రగ్స్‌ ఊబిలోకి దిగడానికి విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలూ కారణమని అధికారులు గుర్తించారు. అనేక కేసుల దర్యాప్తులో భాగంగా గంజాయి, డ్రగ్స్‌ బానిసలు తాము సిగరెట్లతో మొదలుపెట్టే ఈ విషవలయంలో చిక్కుకున్నట్లు బయటపెట్టారు. దీంతో విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్‌ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేసి, నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్‌ చేశారు. అత్యధికంగా చార్మినార్‌ జోన్‌ పరిధిలో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్రనగర్‌ పరిధిలో 102, గోల్కొండ పరిధిలో 98, ఖైరతాబాద్‌లో 78, సికింద్రాబాద్‌లో 64, జూబ్లీహిల్స్‌ లో 54, శంషాబాద్‌లో 52 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు వేల మందికి పైగా సిబ్బంది, అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ఫోర్స్‌, నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌, రిజర్వ్‌ పోలీసులతో కూడిన బృందాలు తనిఖీలు చేశాయి. విద్యాసంస్థల సమీపంలోని దుకాణ యజమానులు అందరూ కోప్టా చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా సిగరెట్లు, గుట్కా, ఈ–సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే 100కు లేదా 8712661601కు సమాచారం అందించాలని సూచించారు.

ఆపరేషన్‌ సేఫ్‌ స్కూల్‌ నిర్వహించిన పోలీసులు

567 కేసులు నమోదు, రూ.1.1 కోట్ల సరుకు సీజ్‌

విక్రేతలపై సమాచారం ఇవ్వండి: కొత్వాల్‌ సజ్జనర్‌

Advertisement
 
Advertisement
Advertisement