● శ్రీనివాస్‌గౌడ్‌కు పచ్చని పంటలు కనిపించలేదా
● విమర్శలు మానుకోకపోతే బుద్ధి చెప్తాం
● పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్
ఆమనగల్లు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు విషప్రచారాలు సాగిస్తున్నారని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్‌పర్సన్ యాట గీత, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహతో కలిసి విలేకరులతో మాట్లాడారు.. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలు సంతోషంగా ఉండడాన్ని చూసి బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పచ్చని పంటలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు మానుకోకపోతే ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా, వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా కరెంట్ అందిస్తున్నామని ఆయన వివరించారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రోడ్డు పక్కన ఓ రైతు వ్యక్తిగత కారణాలతో పంటలకు నీరు పెట్టక ఎండిపోతే అది విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించడం సరికాదన్నారు. వెల్జాలలో అన్ని పంటలు కలకలలాడుతున్నాయని అవి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నియోజక వర్గంలో రూ.వంద కోట్లతో కొత్త విద్యుత్ లైన్‌ల ఏర్పాటు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ సబ్‌స్టేషన్‌ల స్థాయిని పెంచడం జరిగిందని వివరించారు. వెయ్యి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి నిరంతరంగా విద్యుత్ అందించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ వివిధ మండలాల అధ్యక్షులు జగన్, బిచ్చానాయక్, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు శ్రీశైలం, రంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, ఖాదర్, సత్యం, ఫరీద్, కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


