శంషాబాద్: కోర్టు కేసులో ఉన్న భూమిపై కొందరు అధికారులు ప్రొహిబిషన్ ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీపీ ఎల్లయ్య సమక్షంలో శంషాబాద్‌కు చెందిన యుగంధర్‌రెడ్డి సోమవారం తహసీల్దార్ రవీందర్ దత్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొత్వాల్‌గూడ సర్వే నం.130, 131లోని ఏడెకరాల భూమని 2005లో వెంకటయ్య సోదరుల నుంచి యుగంధర్‌రెడ్డి, అరుంధతి కొనుగోలు చేసి భూమిపై పొజిషన్‌లో ఉన్నామన్నారు. దీనిపై దాని పూర్వ యజమానులు పులిమామిడి నర్సింహాగౌడ్‌లు కోర్టులో కేసు దాఖలు చేశారని తెలిపారు. దీనిపై ఇరువర్గాలు కోర్టుకు చేరడంతో సంబంధిత భూమిని ప్రొహిబిషన్‌లో ఉంచారని పేర్కొన్నారు. ఇటీవల ఈ భూమికి సంబంధించిన ప్రొహిబిషన్ ఎత్తివేతకు అధికారులు పూర్వ యజమానుల నుంచి ఫిర్యాదు స్వీకరించారని తెలిపారు. కొందరు ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో ఇప్పటికే కొంత భూమిని ప్రొహిబిషన్ ఎత్తివేతకు పావులు కదుపుతున్నారని బాధితులు ఆరోపించారు. సంబంధిత ‘భూమి’ప్రొహిబిషన్ ఎత్తివేతకు తాము తిరస్కరణ ప్రతిపాదనలోనే ఉంచామని తహసీల్దార్ వారికి తెలిపారు. పూర్తి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.


