డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించండి హిందువులు ఐక్యత చాటాలి ప్రభుత్వ శాఖల సమన్వయంతో హజ్‌ యాత్ర

మొయినాబాద్‌రూరల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ వికారాబాద్‌ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయకోట ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌, ఎంఎస్సీ, లైఫ్‌ సైన్స్‌, పీజెడ్సీ, ఎంజెడ్సీ, బీకాం, బీఏ, సీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 2025–26లో ఇంటర్‌ పాసైన విద్యార్థులు ఒర్జినల్‌ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మండలంలోని తోల్‌కట్ట సమీపంలోని ఎస్‌వీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ కళాశాల కొనసాగుతోందన్నారు.

కడ్తాల్‌: మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ రాజేంద్రపాల్‌ గౌతమ్‌ను కలిశారు. తెలంగాణ గిరిజనుల రాజకీయ స్థితిగతులను సమగ్రంగా వివరించారు. గిరిజన జనాభాలో 70 శాతం మంది మైదాన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, వారికి రాబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియలో తగినన్ని ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని కోరారు. 2027 జనగణన పూర్తయిన తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంతాల్లో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

షాద్‌నగర్‌: హిందువులంతా ఐక్యత చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీగిరి పీఠం శంకర స్వామీజీ అన్నారు. పట్టణంలోని శివమారుతీ దేవాలయం వద్ద ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఐక్యతే మన బలమని, ఆ బలమే జీవితమని పేర్కొన్నారు. హిందూ ధర్మం యొక్క విలువలు, సంప్రదాయాలు, గొప్పతనాన్ని రాబోయే తరానికి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచానికి శాంతి, సహనాన్ని నేర్పిన గొప్ప సంస్కృతి మనదన్నారు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు రామాయణం, భాగవతం గాథలను, ధర్మ సూత్రాలను నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బస్వం, బీజేపీ నేతలు అందెబాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు బెజుగం రమేష్‌, బండారి రమేష్‌, నాగిళ్ల ప్రభాకర్‌, పెంటయ్య, రాజు నాయక్‌, రఘు నాథ్‌యాదవ్‌, అశోక్‌, యాదగిరి, రామ్మోహన్‌, హరీష్‌, ఆంజనేయులు, సోమ శ్రీనివాస్‌, ప్రభుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హజ్‌ కమిటీ చైర్మన్‌ అఫ్జల్‌ బియబానీ

సాక్షి సిటీబ్యూరో: వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే హజ్‌ యాత్రకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 12 వేల మంది యాత్రికులు వెళ్లనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేసిందని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మౌలానా సయ్యద్‌ అఫ్జల్‌ బియబానీ ఖుస్రో పాషా వ్యాంప్‌ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో హజ్‌ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. యాత్రికులు తమ లగేజీని గుర్తించడానికి ప్రత్యేక బ్యాగులకు ప్రత్యే స్టిక్కర్లను అతికిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులతో క్యాంప్‌ నిర్వహణ కోసం సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మే 4 నుంచి 21 తేదీ వరకు 23 విమానాల్లో తెలంగాణ రాష్ట్ర యాత్రికులు వెళ్తారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement