● అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
● ముందస్తు జాగ్రత్తలతో ఉపశమనం
షాబాద్: ప్రస్తుత వేసవిలో ఎండలు మండుతుండడంతో జనం హడలెత్తిపోతున్నారు. మున్ముందు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో నిత్యం 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండల కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది.
ఎల్లో అలర్ట్
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని, చిన్నారులు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన వారిలో కాళ్ల వాపులు, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోల్పోవడం, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి.
ప్రాథమిక చికిత్స
● వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి.
● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబొండం లేదా చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం. గ్లూ కోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్‌ఎస్) తాగించవచ్చు.
● వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు
● వేసవిలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా తినాలి.
● ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన, చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించాలి.
● ఆల్కాహాల్, సిగరేట్, కార్బొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండాలి.
● ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించాలి.
● వేసవిలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
● వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి.
● ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
● ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది.
చేయకూడని పనులు
● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఎక్కువగా తిరగరాదు.
● రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు. ఇంట్లో వండుకున్నవి మాత్రమే తినాలి.
● మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి.
● పుచ్చ కాయలు, కీరదోస, కర్బూజ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
● శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు, మామిడి, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.
● వేసవిలో ఆకలి తక్కువగా దాహం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండి బరువును నియంత్రించవచ్చు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.
బయటకు వెళ్లొద్దు
పిల్లలు, వృద్ధులతో పాటు ప్రజలు ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరమైతే తలకు టోపి ధరించి వెళ్లాలి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ ప్రణీత్, చందనవెళ్లి పీహెచ్‌సీ


