డేటా డైవర్షన్‌ | - | Sakshi
Sakshi News home page

డేటా డైవర్షన్‌

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

సర్కారుకే సవాల్‌ విసిరిన ట్రాన్సాక్షన్‌ ఎనలిస్ట్స్‌ ఇండియా

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎస్‌డీ) సంస్థనే బెదిరించిన ట్రాన్సాక్షన్‌ ఎనలిస్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఏ) సంస్థ వ్యవహారాన్ని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. టీ–వాలెట్‌ యాప్‌ నిర్వహణ గడువు ముగిసినా డేటా, ప్రజాధనం అప్పగించకపోవడం, వీటిని మరో ప్రైవేట్‌ యాప్‌లోకి మళ్లించే ప్రయత్నాలు చేయడం, ఈఎస్‌డీని బెదిరించడం తదితర ఆరోపణలపై గత వారం సీసీఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను క్యాష్‌లెస్‌గా అందించడానికి ప్రభుత్వం 2017లో టీ–వాలెట్‌ ప్లాట్‌ఫాంను రూపొందించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫాంకు 16 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరి కేవైసీ వివరాలు, లావాదేవీల హిస్టరీతో పాటు రూ.14 కోట్లు ప్రజా నిధులతో పాటు సున్నిత సమాచారం కూడా ఇందులో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం 2018 నవంబర్‌ 1న ట్రాన్సాక్షన్‌ ఎనలిస్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఏ) సంస్థను ఎంపిక చేసి, ఒప్పందం చేసుకుంది. అప్పట్లో దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది. ఒప్పందం ప్రకారం నిర్వహణ గడువు ముగిసిన తర్వాత టీఏ సంస్థ మొత్తం డేటా, సోర్స్‌ కోడ్‌తో పాటు డిజిటల్‌ ప్రాపర్టీలను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం 2018 నుంచి 2025 వరకు పలు దశల్లో పొడిగించింది. తాజాగా కాంట్రాక్ట్‌ గడువు ముగియబోతుండగా ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియ ద్వారా పర్వ్యూ ఇండియా కన్సల్టింగ్‌ అండ్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థను ఎంపిక చేసింది. ఆపై సమాచారంతో పాటు సాకేంతిక పరిజ్ఞానం తదితరాలు అప్పగించాల్సిందిగా కోరుతూ టీఏ సంస్థకు ప్రభుత్వం పలుమార్లు ఆదేశించినా ఆ సంస్థ పట్టించుకోలేదు. తొలుత టీఏ సంస్థ డేటా అందిస్తామని చెప్పినప్పటికీ ఆపై పంథా మార్చి ప్రభుత్వ విభాగానికే సవాల్‌ విసిరింది. దీంతో ఈఎస్‌డీ శాఖ గత ఏడాది నవంబర్‌ 12న టీఏ సంస్థకు ఫైనల్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ఆ సంస్థ టీ–వాలెట్‌పై తమకే పూర్తి హక్కు ఉందనే కొత్త వాదన తెరపైకి తెచ్చింది. అంతటితో ఆగకుండా టీ–వాలెట్‌ వినియోగదారుల డేటా, కేవైసీ వివరాలు, లావాదేవీల సమాచారంతో పాటు రూ.14 కోట్ల ప్రజా నిధులను ‘టీఏ వన్‌ యాప్‌’ అనే ప్రైవేట్‌ యాప్‌కు మళ్లించేందుకు అదే నెల 28న ప్రయత్నించారు. దీన్ని ఈఎస్‌డీ అడ్డుకోవడంతో ఆ డేటాను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ యాప్‌కు మార్చేస్తామని టీఏ సంస్థ బెదిరింపులకు దిగింది. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలు దెబ్బతినడంతో పాటు ప్రజా డేటా భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఈఎస్‌డీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు టీఏ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా టీఏ సంస్థపై కేసు నమోదు చేశారు. తక్షణం టీఏపై చర్యలు తీసుకోకుంటే రూ.14 కోట్ల ప్రజా నిధులు దుర్వనియోగం కావడంతో పాటు సున్నితమైన డేటా లీక్‌, ఐడెంటిటీ థెఫ్ట్‌ వంటి ప్రమాదాలు ఉండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ నుంచి సర్వర్లు, డేటాబేస్‌, డిజిటల్‌ ఆధారాల స్వాధీనానికి సీసీఎస్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

కస్టమర్ల డేటా, ప్రజాధనం

పరిరక్షణకు సీసీఎస్‌ చర్యలు

‘టీ–వాలెట్‌ డేటా’

కేసు దర్యాప్తు ముమ్మరం

సాంకేతికంగా ముందుకు

వెళుతున్న పోలీసు అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement