బాత్‌రూంలో బంధించి.. నగలు చోరీ | - | Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో బంధించి.. నగలు చోరీ

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

షాద్‌నగర్‌రూరల్‌: మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి లాడ్జ్‌కు తీసుకెళ్లి ఓ ఐటీ ఉద్యోగి వద్ద బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తి లూటీ చేసిన ఘటన షాద్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామానికి చెందిన లింగారం నరేష్‌గౌడ్‌ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన శనివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు షాద్‌నగర్‌ బస్టాండ్‌ బస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి నరేష్‌గౌడ్‌ వద్దకు వెళ్లి డిస్ట్రిబ్యూటర్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, మాయమాటలు చెప్పి బస్టాండ్‌ సమీపంలో ఉన్న సంగమేశ్వర లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నరేష్‌గౌడ్‌ మెడలో ఉన్న బంగారు చైన్‌తో పాటుగా మూడు ఉంగరాలను అపహరించి, బాత్‌రూంలో బంధించి పరారయ్యాడు. నరేష్‌గౌడ్‌ కేకలు వేయడంతో లాడ్జ్‌ సిబ్బంది వచ్చి తలుపులు తీశారు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.

చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

కుల్కచర్ల: ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటనలో విషాదమే మిగిలింది. పరిగి మండలం హీరాపూర్‌కు చెందిన వీరపురం రామస్వామి(22) శుక్రవారం కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌ అక్కమ్మ చెరువులో గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకూ వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయాన్నే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టగా మధ్యాహ్నం వేళ రామస్వామి మృతదేహం లభించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

సామాజిక మార్పునకు న్యాయవిద్య దోహదం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద

బంజారాహిల్స్‌: న్యాయవిద్య సామాజిక మార్పునకు దోహదం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద అన్నారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్‌ ఉల్‌ ఉలూం లా కాలేజీలో అంజద్‌ అలీఖాన్‌ స్మారక మూట్‌ కోర్ట్‌ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం శనివారం కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ సూరేపల్లి నంద, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గౌస్‌ మీరా మోహియుద్దీన్‌తో కలిసి హాజరయ్యారు. జస్టిస్‌ నంద మాట్లాడుతూ న్యాయశాస్త్ర విద్యార్థులు మంచి న్యాయవాదులుగానే కాకుండా మంచి మనుషులుగా కూడా ఎదగాలన్నారు. మూట్‌ కోర్ట్‌ పోటీలు విద్యార్థుల్లో న్యాయ పరిశోధన, వాదనా నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ మూట్‌ కోర్ట్‌ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ లా కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం డీన్‌ వెంకటేశ్వర్లు, నేషనల్‌ కంపెనీ లా అప్పిలెంట్‌ ట్రిబ్యునల్‌ మాజీ మెంబర్‌ శిరీష మేర్ల, సుల్తాన్‌ ఉల్‌ ఉలూం ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ మహ్మద్‌ వలియుల్లా, గౌరవ కార్యదర్శి జాఫర్‌ జావెద్‌, లా కాలేజీ ప్రిన్సిపాల్‌ గీతారావు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన

సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులను హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి శనివారం తన చాంబర్‌లో అభినందించారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి ఒడ్డెన్న, కళాశాలల ప్రిన్సిపాల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement