లక్ష పైచిలుకు వ్యవసాయ బోరుబావులు
సహకరించాలి
వికారాబాద్: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావుల్లో నీరు భారీగా పడిపోయింది. దీంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండుతున్న పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోని బోర్లలో సైతం నీరు రావడం లేదు. మూగజీవుల దాహార్తిని తీర్చడం కష్టంగా మారింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలాఖరుకు మీటరు లోతుకు జలాలు పడిపోయాయి. ఏప్రిల్, మే చివరి నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలు మచ్చుకై నా కనిపించడంలేదు. జిల్లాలో వేలకు వేలు ఇంకుడు గుంతలు తవ్వామని చెబుతున్న అధికారులు వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. చెక్ డ్యామ్‌లు, ఫాం ఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కవగా అడుగంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బోరు బావులు తవ్వడం కూడా ప్రధాన సమస్యగా మారింది.
గత ఫిబ్రవరితో పోలిస్తే..
గత ఫిబ్రవరితో పోలిస్తే భూగర్భ జలాలు మీటరు లోతుకు చేరాయి. మార్చి నెలాఖరు నాటికి మరింత లోతుకు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో జిల్లాలో సగటున 12.87 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా మార్చి నెలాఖరు నాటికి 13.89 మీటర్ల లోతుకు చేరాయి. సాధారణంగా చూస్తే గతేడాది ఈ మార్చి నెలాఖరు నాటికి అత్యధికంగా 27.17 మీటర్ల లోతుకు అడుగంటాయి. మర్పల్లి మండలంలో అత్యధికంగా 27.17 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఫిబ్రవరితో పోలిస్తే ఈ నెల రెండు నెలల్లో మీటర్ల లోతుకు చేరాయి. చౌడాపూర్ మండలంలో అత్యల్పంగా 6.40 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. దోమ, వికారాబాద్ మండలాల్లోనూ 20 మీటర్ల లోతుకు చేరాయి. లక్నాపూర్, కోట్‌పల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు సగానికిపైగా అడుగంటాయి. చిన్న చిన్న చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి.
ఇష్టారాజ్యంగా బోరుబావులు
వాతావారణ పరిస్థితులు, నీటి లభ్యత లాంటి విషయాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు బోరుబావులు తవ్వుతున్నారు. ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. కొందరు రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు వినియోగించి బోరుబావుల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నారు. వీరు రాత్రి సమయంలో కరెంటు ఉన్నంత సేపు బోరుబావులు నడిచేలా సెట్ చేసి ఉండటంతో అవసరానికి మించి నీరు పారుతోంది. చాలా చోట్ల వృథాగా పోతున్నాయి. ఇది కూడా భూగర్భజలాలు అడుగంటడానికి కారణమవుతోంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. భూగర్భజలాలు ఉన్నాయా లేవో అని చూసుకోకుండా బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జియాలజిస్టులు చూపుతున్న పాయింట్లు సైతం సగానికిపైగా ఫెయిల్ అవుతున్నాయి.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత లోతుకు..
నెల రోజుల్లోనే రెండు మీటర్లు పడిపోయిన వైనం
పలు మండలాల్లో 20 మీటర్లు పైగానే..
మర్పల్లిలో అత్యధికంగా 27.17 మీటర్ల లోతుకు..
ఎండుతున్న చెరువులు, కుంటలు
పంటలపై తీవ్ర ప్రభావం
జిల్లాలో లక్ష పైచిలుకు వ్యవసాయ బోరుబావులు ఉండగా మరో 35 వేలకు పైగా ఇంటి బోరు బావులు ఉన్నాయి. 12 వేల వరకు అనధికార బోరుబావులు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమతులు లేకుండా బోరు బావులు తవ్వే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం ఒక బోరుకు మరో బోరుకు మధ్య 80 మీటర్ల దూరం ఉండాలి. అదే ప్రజావసరాలకు వినియోగించే బోరుబావికి 250 మీటర్ల దూరం పాటించాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. బోరు వేయాలనుకుంటే భూగర్భ జలవనరుల శాఖ నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి. జిల్లాలో సగటున ప్రతి నెలా 300 పైగా బోరుబావులు తవ్వుతున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఏడాదికి 2వేల నుంచి 3వేల వరకు తవ్వుతున్నారు. వీటిలో ఒక్క శాతం వాటికి కూడా అనుమతులు తీసుకోవడం లేదు.
భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇంకుడు గుంతలు తవ్వటంతో పాటు నిర్వహణ సక్రమంగా ఉండాలి. కుంటలు, చెరువులు, చెక్ డ్యామ్‌లలో పూడిక తీసి నీరు ఇంకేలా చూడాలి. నీటిని పొదుపుగా వాడటం సామాజిక బాధ్యత. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే బోరు తవ్వుకోవాలి.
– రవిశంకర్, జిల్లా భూగర్భ జల అధికారి


