ప్లాట్లు.. నిబంధనలకు తూట్లు | - | Sakshi
Sakshi News home page

ప్లాట్లు.. నిబంధనలకు తూట్లు

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

కందుకూరు: వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయాలు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్లు చేయాల్సిన రోడ్లు, ఓపెన్‌ ఏరియా, సోషల్‌ ఇన్‌ఫ్రా తదితరాలు చేయకుండా రియల్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ మండలంలో ప్రస్తుతం పలు గ్రామాల్లో నెలకొన్న సమస్య.

ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు

రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ ప్రారంభమైన 2006 సంవత్సరం నుంచి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో డీటీసీపీ లేఅవుట్లతో పాటు అనధికార లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. వాటిల్లో ప్లాట్లు విక్రయాలు పూర్తయి చాలా ఏళ్లు గడుస్తుంది. కాగా వెంచర్లు ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ పంచాయతీలకు పార్కు, కమ్యూనిటీ స్థలాలు, రోడ్లు రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయాలి. దీంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కానీ చాలా గ్రామాల్లో వేసిన వెంచర్లలో రియల్‌ వ్యాపారులు ప్లాట్లు విక్రయించి చేతులు దులుపుకొన్నారు తప్పా అందులోని ఖాళీ స్థలాలు, ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన స్థలాలు, రోడ్లు రిజిస్ట్రేషన్లు చేయకుండా మిన్నుకుండిపోయారు. 35 గ్రామ పంచాయతీల్లో దాదాపు సగానికి పైగానే పంచాయతీల పరిధిలో పదుల సంఖ్యలోనే అలాంటి వెంచర్లు ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలు అలాంటి వాటిని గుర్తించి ఖాళీ స్థలాలతో పాటు రోడ్లు పంచాయతీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పథకాలతో లబ్ధి

వెంచర్లలో ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన ఖాళీ స్థలాలు, రోడ్లు రిజిస్ట్రేషన్లు చేయించకపోవడంతో చాలా మందికి అది అవకాశంగా మారింది. ప్రస్తుతం రికార్డుల్లో వారికి ఆ స్థలం అంతా భూమిగా నమోదు కావడంతో ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. రైతుభరోసా వంటి పథకాలతో లబ్ధి పొందుతున్నారు. మరోపక్క శ్రీశైలం రహదారి నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఆ రహదారి వెళ్లే భూమిని ప్రభుత్వం పేరుతో నమోదు చేయలేదు. దీంతో పట్టాదారు పాస్‌పుస్తకాల్లో సైతం రహదారి విస్తీర్ణం కూడా భూమి కింద నమోదయింది. పలుచోట్ల అలాంటి పాస్‌పుస్తకాలతో విక్రయించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

గూడూరు సమీపంలో రోడ్లు, పార్కు స్థలాలు పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ చేయని వెంచర్‌

పంచాయతీలపై రిజిస్ట్రేషన్లు కాని వెంచర్‌ రోడ్లు, పార్కు స్థలాలు

ప్లాట్లు విక్రయించి కాసులు దండుకున్న రియల్‌ వ్యాపారులు

పట్టించుకోని పంచాయతీ అధికారులు

చర్యలు తీసుకుంటాం

గతంలో అధికారిక, అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను గుర్తిస్తాం. అందులోని రోడ్లు, పార్కు స్థలాలు వంటి వాటిని గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్‌ చేయకపోతే నోటీసులు ఇస్తాం. క్షేత్రస్థాయి సిబ్బందితో రిజిస్ట్రేషన్‌ చేయించేలా చర్యలు తీసుకుంటాం.

– గీత, ఎంపీఓ, కందుకూరు

Advertisement
 
Advertisement
Advertisement