● దుర్వాసన భరించలేకపోతున్నాం
● హస్తేపూర్‌వాసుల ఆందోళన
● ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం
చేవెళ్ల: గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని, సదరు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని హస్తేపూర్‌వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక సర్పంచ్ జ్యోతిభూపాల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మైరాన్ కంపెనీ ద్వారా గ్రామంలోకి వస్తున్న దుర్వాసనతో ప్రజలు శ్వాసకోష వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. కంపెనీ వద్దకు వెళ్లి పరిశీలించగా జంతువుల ఎముకలు, కోళ్ల వ్యర్థాలు, రక్తంతో నిండిన ఎముకలను ఉడికిస్తున్నారని మండిపడ్డారు. ఈ కంపెనీతో హస్తేపూర్, అంతారం వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లగా కంపెనీని మూసేయాలని ఆదేశించారన్నారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎం.జంగయ్య, బి.యాదయ్య, పి.మహేందర్, వై.క్రిష్ణ, జి.భూపాల్‌గౌడ్, శ్రీకాంత్, గోవర్ధన్‌గౌడ్, పెంటయ్య, నర్సింలు, రాజు, ఈశ్వర్, రాజేందర్, నర్సింహ, వెంకటేశ్, క్రిష్ణయ్య ఉన్నారు.


