పవర్‌ఫుల్‌ డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ డిమాండ్‌

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం గత రికార్డును బ్రేక్‌ చేసింది. సాధారణంగా మేలో నమోదు కావాల్సిన రికార్డు.. ప్రస్తుతం ఏప్రిల్‌ రెండోవారంలోనే నమోదు కావడం విశేషం. డిస్కం చరిత్రలో అత్యధికంగా 2024 మే 29న 91.68 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. 2025లో ఇదే సమయంలో 3,800 మెగావాట్లు మించలేదు.. కానీ ఈ ఏడాది గత మూడు రోజులుగా విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం ఏకంగా 4,452 మెగావాట్లు(95.29 ఎంయూ) నమోదైంది. మధ్యాహ్నంతో పోలిస్తే.. సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల మధ్య అత్యధిక డిమాండ్‌ నమోదువుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మే చివరి నాటికి వంద మిలియన్‌ యూనిట్లు దాటే అవకాశం లేకపోలేదని ఇంజనీరింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒత్తిడిలో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో మాత్రమే కన్పించిన ఏసీలు.. ప్రస్తుతం సాధారణ, మధ్య తరగతి నివాసాల్లో సర్వ సాధారణమయ్యాయి. ఎండలు భగ్గున మండుతుండటానికి తోడు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్‌లో ఉండడంతో వినియోగం రెట్టింపైంది. ఒక్కసారిగా పెరిగిన విద్యుత్‌ వినియోగంతో సబ్‌స్టేషన్లలోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. తరచూ ఫీడర్లు ట్రిప్పవుతుండడంతో సరఫరాలో అంతరాయం తలెత్తుత్తోంది. ఫ్యూజులు కొట్టేస్తుండడంతో ఆ సమయంలో చెలరేగిన మంటలు వాటికింద పేరుకుపోయిన చెత్తలో పడి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి.

8వ రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె

తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆర్టిజన్‌, పీస్‌రేట్‌ వర్కర్లు, అన్‌ మ్యాన్డ్‌ వర్కర్లు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. జెన్‌కోలో 3,608 మంది, ట్రాన్స్‌కోలో 3,774 మంది, ఎస్పీడీసీఎల్‌లో 8,595 మంది, ఎన్‌పీడీసీఎల్‌లో 3,470 మంది ఉన్నారు. వీరిలో మెజార్టీ కార్మికులు ఎనిమిది రోజులుగా విధులకు దూరంగా ఉంటున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. పలు చోట్ల లైన్లు తెగిపడుతున్నాయి. ఈ సమయంలో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. సబ్‌స్టేషన్లు, ఆపరేషన్స్‌ వంటి కీలక విభాగాల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో సరఫరా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. శివారు సర్కిళ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అర్ధరాత్రి ఇంట్లో కరెంట్‌ లేకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రేటర్‌ జిల్లాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్‌ జిల్లాల్లో వారం రోజుల్లో నమోదైన విద్యుత్‌ డిమాండ్‌ ఇలా

తేదీ మెగావాట్లు మిలియన్‌ యూనిట్లు

07 3,933 84.09

08 3,989 85.56

09 4,106 87.72

10 4,119 89.25

11 4,049 88.92

12 3,960 84.30

13 4,387 92.89

14 4,452 95.29

గ్రేటర్‌ విద్యుత్‌ స్వరూపం

33 కేవీ సబ్‌స్టేషన్లు 498

పీటీఆర్‌లు 1022

డీటీఆర్‌లు 1,50,992

విద్యుత్‌ స్తంభాలు 5,08,271

మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు 63 లక్షలు

33 కేవీ ఓవర్‌హెడ్‌లైన్లు 3725 కిలోమీటర్లు

11 కేవీ ఓవర్‌హెడ్‌లైన్లు 21,634 కిలోమీటర్లు

11 కేవీ యూజీ కేబుళ్లు 957 కిలోమీటర్లు

గ్రేటర్‌లో అనూహ్యంగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

2024 మే 29న రికార్డు స్థాయిలో 91.68 ఎంయూలు

2026 ఏప్రిల్‌ 14న ఏకంగా 95.29 మెగావాట్లు నమోదు

హీటెక్కుతున్న సబ్‌స్టేషన్లు.. ట్రిప్పవుతున్న ఫీడర్లు

తరచూ తప్పని అంతరాయాలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

Advertisement
 
Advertisement
Advertisement