● మధ్యాహ్నం 12 తర్వాత బయటికి వెళ్లొద్దు
● డీఎంహెచ్‌ఓ లలితాదేవి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రస్తుతం ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. వీటి ధాటికి డీ హైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటలలోపు బయట తిరగక పోవడమే ఉత్తమం. అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. లేదంటే వడదెబ్బకు గురై.. అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉంది’అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. సలహాలతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఎక్కువ ముప్పు వీరికే
గంటల తరబడి బైక్‌లపై ప్రయాణించే మార్కెటింగ్ ఏజెంట్లు, ఉపాధి హామీ కూలీలు, యాచకులు, వీధి వ్యాపారులు, ఎండలో ఆడే చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బబారిన పడుతుంటారు. ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల డీహైడ్రేషన్‌కు లోనవుతుంటారు.
లక్షణాలు
అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల బారిన పడుతుంటారు. తీవ్రమైన అలసటతో పాటు శరీరం ఎర్రబారటం, పొడిగా మారుతుంది. గందర గోళం, స్పృహ కోల్పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి.
జాగ్రత్తలు
● సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దు. అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్, తలకు క్యాప్, కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.
● ఉక్కపోత నుంచి ఉపశనమనం కోసం వదులైన లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలి. కఠినమైన శారీరక శ్రమ చేయకూడదు.
● మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. మసాల వంటలకు బదులుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
● కూల్‌డ్రింక్స్‌కు బదులుగా మజ్జిగ, చెరుకు రసం, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. వాటర్‌మిలాన్, కర్బూజా, మోసంబి, నిమ్మ పండ్ల రసాలు తీసుకోవాలి.
● స్పృహతప్పిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, చన్నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.


