చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హుడాకాంప్లెక్స్: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనిస్తోందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా డిసెబులిటి సెంటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌ఐఎంసీఓ) ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టి, సంకల్పబలం వల్ల దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయని చెప్పారు. వివిధ ఇండస్ట్రీస్, కంపెనీలలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాని చొరవతోనే సాధ్యమైందన్నారు. దివ్యాంగులు స్వయం సమర్థులుగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలనే లక్ష్యంతో ఉన్నారని, సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తోందని ఇలాంటి గొప్ప సంకల్పంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డి, సరూర్‌నగర్ తహసీల్దార్ వేణుగోపాల్, జిల్లా ఉప వైద్యాధికారి గీత తదితరులు పాల్గొన్నారు.


