అనంతగిరి: పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బాధిత రైతులు బీసీ, ఎస్టీ, ఎస్టీ జేఏసీల ఆధ్వర్యంలో వికారాబాద్‌లో ఆర్‌డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కవిత, డాక్టర్ విశారదన్ మహరాజ్ రైతులతో కలిసి ఆర్‌డీఓ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండను లెక్క చేయకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎన్‌టీఆర్ చౌరస్తాకు చేరుకొని బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపమని తేల్చి చెప్పారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను దారి మళ్లించారు. దాదాపు 4 గంటల పాటు ధర్నా కొనసాగింది. కాళ్లాపూర్‌కు చెందిన మహిళా రైతు నర్సమ్మ, సర్పంచ్ పులిందర్ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. రైతులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించారు. వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. సాయంత్రం కవిత తోపాటు విశారదన్ మహరాజ్‌ను బంట్వారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు వాహనం వెంట కొద్ది దూరం పరుగులు తీయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
పరిశ్రమల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని కవిత మండిపడ్డారు. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేస్తామన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి పెనం మీద ఉంటే.. ఇప్పుడు పొయ్యిలో పడినట్టు అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరన్నారు. నిజామాబాద్‌లో కూడా పసుపు రైతులు ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరో పది రోజుల్లో ఈ గడ్డపై మరో ప్రాంతీయ పార్టీ రాబోతుందన్నారు. 25న ఆ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. మనమంతా ఐక్యంగా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఽరైతు ఽసమస్యలపై ఆమె కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరిట వేల ఎకరాలను లాక్కునే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1,200 ఎకరాల పేద, మధ్య తరగతి రైతుల భూముల సేకరించేందుకు యత్నిస్తోందన్నారు. వారి తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.
బంట్వారం: ఠాణాలో కల్వకుంట్ల కవిత
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
వికారాబాద్‌లో భారీ ధర్నా
అదుపులోకి తీసుకున్న పోలీసులు
రైతులు – పోలీసుల మధ్య వాగ్వివాదం


