ఇద్దరు నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి
మహేశ్వరం: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువ చేసే సుమారు 9.4 కిలోల హష్ ఆయిల్(గంజాయి నుంచి తయారు చేసే నూనె)ను స్థానిక, ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో డీసీపీ నారాయణరెడ్డి సోమవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీడిమడుగుల మండలం సంకులమిడ్డె గ్రామానికి చెందిన కొరాబు చంటిబాబు, ఒడిశాకు చెందిన రాజారావు నుంచి హష్ ఆయిల్ సేకరించి(డ్రగ్) సేకరించి, నగరంలోని గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా సరఫరా చేయడానికి ప్రయత్నించారు. మార్చి 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహేశ్వరం గేటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో చంటిబాబు వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా పది పాలిథిన్ కవర్లలో ఉన్న హష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నారు. పట్టుబడిన హష్ ఆయిల్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుడు చంటిబాబుపై ఏపీలోని కంచరపాలెం, అనాకపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో నాలుగు ఎన్‌డీఎఫ్ కేసులు నమోదయ్యాయి. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్ 8712662664 నంబర్‌కు లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఆపరేషన్‌లో ప్రతిభకనబర్చిన అధికారులు, పోలీసులను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషర్ సుధీర్‌బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


