కందుకూరు: పట్టా భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తిమ్మాయిపల్లి రైతులు తేల్చి చెప్పారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని అన్నోజిగూడలో తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్లు 1 నుంచి 13 వరకు ఉన్న పట్టా భూములు 63 ఎకరాలతో పాటు సర్వే నంబర్లు 14, 15లో ఉన్న ప్రభుత్వ భూమిని సేకరించడానికి గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు భూములు ఇచ్చి సహకరించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ వారికి సూచించారు. న్యాయమైన పరిహారం అందుతుందని తెలిపారు. కొద్ది విస్తీర్ణంలో ఉన్న పట్టా భూములను తీసుకుంటే తాము ఏవిధంగా జీవించాలో చెప్పాలని రైతులు వాపోయారు. అసైన్డ్ భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పట్టా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని స్పష్టం చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డీఏ శంషొద్దీన్, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ ఢిల్లీ పద్మకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తేల్చి చెప్పిన రైతులు


