ఒక్కొక్కరికి ఒక్కోలా పన్నులు ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వం కరువైన పర్యవేక్షణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆస్తుల అసెస్‌మెంట్‌లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వారికి ఒకలా.. లేని వారికి మరోలా పన్నులు వేస్తున్నారు. ఒకే తరహా ఆస్తికి రెండు రకాలు వసూలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా పట్టణ, గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు ఆఫీసు గేటు దాటి బయటికి తొంగి చూడటం లేదు. ఏదైనా ఫిర్యాదు అందితే మినహా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా 111 జీఓ పరిధిలోని మున్సిపాలిటీలు సహా పంచాయతీల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కళ్లముందే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కళ్లప్పగించి చూడటం, తర్వాత ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తుల అసెస్‌మెంట్ పేరుతో ఒక్కో నిర్మాణం నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన మొత్తంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు సైతం వాటాలు అందుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోగా..పరోక్షంగా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటికి పాత తేదీల్లో కొత్తగా ఇంటినంబర్లు జారీ చేస్తున్నారు. ఆస్తుల అసెస్‌మెంట్ పేరుతో స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లను సైతం డొమెస్టిక్ విభాగంలో నమోదు చేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో వసూళ్లు అంతంతే..
ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, షాద్‌నగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల పరిధిలో 50 వేలకుపైగా గృహాలు, ఐదు వేలకుపైగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి ఆశించి నస్థాయిలో పన్నులు వసూలు కావడం లేదు. ఇక్కడ ఆస్తిపన్ను వసూళ్లు ఇప్పటి వరకు 75 శాతం కూడా మించలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆస్తుల అసెస్‌మెంట్స్, హోర్డింగులు, ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణాలకు అనుమతుల జారీ రూపంలో వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది. డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, పార్కుల వంటి చిన్నచిన్న అవసరాలకు ప్రభుత్వం వద్ద చేయి చాచాల్సి వస్తోంది. షాద్‌నగర్, ఆమనగల్లు, కొత్తూరు మున్సిపాలిటీలకు అతి తక్కువ ఆదాయం సమకూరుతోంది. వచ్చిన ఆదాయం సిబ్బంది వేతనాలకు కూడా సరిపోవడం లేదు. అభివృద్ధి పథకాలపై ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఇక శంషాబాద్ మున్సిపాలిటీలో పన్నులను రెట్టింపు వడ్డిస్తున్నారు. ఇది పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండడం, నిర్మాణాలకు అనుమతులు లేకపోవడమే కారణం. ఇల్లీగల్ భవనాలకు అపరాధ రుసుంతో వడ్డిస్తున్నారు. ఫలితంగా ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే ఇక్కడ ఆస్తిపన్ను డబుల్ అవుతోంది. అయినా నిధుల కొరత తప్పడం లేదు. ఇటీవల కొత్తగా ఏర్పడిన మొయినాబాద్, చేవెళ్లలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఆస్తుల అసెస్‌మెంట్‌లో చేతివాటం
141 పంచాయతీల్లో వందశాతం వసూళ్లు
జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా, వీటిలో 2,70,708 ఆస్తులు ఉన్నాయి. అసెస్‌మెంట్, ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా ఆయా పంచాయతీల ఖాతాల్లోకి మొత్తం రూ.78,06,021 నగదు వచ్చి చేరింది. ఇదిలా ఉంటే ఆస్తిపన్ను వసూళ్లు 141 గ్రామ పంచాయతీల్లో వందశాతం దాటడం విశేషం. 15వ ఆర్థిక సంఘం నుంచి మూడు విడతల్లో ఆయా పంచాయతీల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఒక్కో పంచాయతీలో రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు ఉన్నాయి. ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఖాతాలో నిల్వలు మరింత పెరిగిపోయాయి. ఇతర పంచాయతీలతో పోలిస్తే అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్‌లో 57 శాతం, చేవెళ్ల మండలం రేగడిఘనపూర్ 55 శాతం, కేశంపేట మండలంలోని వేములనర్వ్‌లో 47 శాతం ఆస్తిపన్ను వసూళ్లతో వెనుకబడి ఉండటం కొసమెరుపు. పంచాయతీ ఖాతాల్లో పుష్కలంగా నిధులు ఉండటంతో వీటిని కొల్లగొట్టేందుకు పలువురు కార్యదర్శులు అడ్డ దారులు తొక్కుతున్నారు. గతంలో చేయని పనులకు చేసినట్లు నకిలీ బిల్లులు పెడుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు.


