నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత

Mar 3 2026 9:16 AM | Updated on Mar 3 2026 9:16 AM

నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి డీసీపీ కార్యాలయాన్ని సందర్శించిన సీపీ

మొయినాబాద్‌: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నట్టు చెప్పారు. గ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. భక్తులకు దర్శన అవకాశం ఉండదన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే వినతులను శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ వారం 51 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, వివిధ శాఖల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి విధిగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సాహితి, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు, గుండుబావి శ్రీనివాస్‌రెడ్డి, అపోలో ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణంలోని మిలీనియం టౌన్‌షిప్‌ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ కార్యాలయాన్ని సోమవారం ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ శిరీష ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం సీపీ సుధీర్‌బాబు నియోజకవర్గంలోని సీఐలు, ఎస్‌ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నెలకొన్న స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్రైం రేటు పెరగకుండా ఉండేందుకు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement