గుట్టకాయ స్వాహా! | - | Sakshi
Sakshi News home page

గుట్టకాయ స్వాహా!

Mar 3 2026 9:16 AM | Updated on Mar 3 2026 9:16 AM

గుట్టలనూ వదలని అక్రమార్కులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమార్కులు ప్రభుత్వ, అసైన్డ్‌ భూములే కాదు.. కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. ఒకవైపు గుట్టుగా మైనింగ్‌ (మట్టి తవ్వకాలు, గ్రానేట్‌ అమ్మకాలు) చేస్తూనే మరోవైపు చుట్టూ బౌన్సర్లను పెట్టి భూమిని చదును చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, తర్వాత లే అవుట్లు చేసేస్తున్నారు. వీరి వెనుక స్థానికంగా ఉన్న అధికారపార్టీ పెద్దలు ఉండడంతో విషయం తెలిసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కళ్లముందే ఖరీదైన భూములు కరిగిపోతున్నా.. వాటిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హయత్‌నగర్‌లోని వీరన్నగుట్ట పూర్తిగా కబ్జాకు గురైంది. బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలోని మరో గుట్ట సహా దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా బాలాపూర్‌ మండల పరిధిలోని పలు విలువైన గుట్టలు కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

దేవతలగుట్టపై దెయ్యాల పాగా

బాలాపూర్‌ రెవెన్యూ సర్వే నంబర్లు 78, 79, 80,81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90లో దేవతల గుట్ట ఉంది. గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి విలువైన భూములను ఆక్రమించేస్తున్నారు. అర్బన్‌ సీలింగ్‌ నేచర్‌ సహా మల్టీపుల్‌ కేసులున్న ఈ భూముల్లో ఇప్పటికే కొంత ఆక్రమణకు గురికాగా.. తాజాగా మరికొంత భూమి కబ్జాకు యత్నిస్తున్నారు. చుట్టూ బౌన్సర్లను పెట్టి.. అటువైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటున్నారు. ఖరీదైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు చేస్తున్నారు. ఆక్రమించిన ఆయా భూములను 400 గజాల ప్లాట్ల చొప్పున విభజించి గుట్టుగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గుట్ట చుట్టూ జిలెటిన్‌స్టిక్స్‌తో పెద్ద ఎత్తున పేలుళ్లు చేపడుతున్నారు. సమీపంలోని నివాసాలు దెబ్బతింటున్నా.. మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గ్రానైట్‌ సహా విలువైన భూములను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోంది.

అనధికారిక వెంచర్లు.. అడ్డగోలు రోడ్లు

శంషాబాద్‌ మండలం గొల్లపల్లి కేంద్రంగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. బహుదుర్‌గూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 62లో 500 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, వీటి మధ్య నుంచి 1.5 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. బహుదుర్‌గూడ–తుక్కుగూడ ఔటర్‌ సర్వీసు రోడ్డుకు అనుసంధానంగా ఈ రోడ్డును వేశారు. ఎయిర్‌పోర్టు రన్‌వేకు అతి సమీపంలోని పొలాలను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు. వీటిలో పెద్ద సంఖ్యలో విల్లాలు నిర్మిస్తున్నారు. ఐదు నిమిషాల్లో ఔటర్‌కు చేరుకోవచ్చని ప్రచారం చేసుకుంటున్నారు. శంషాబాద్‌ మండలం చౌదరిగూడ సర్వే నంబర్‌ 34లోని సీలింగ్‌ భూముల్లోనూ వెంచర్లు వెలిశాయి. శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ సర్వే నంబర్‌ 192లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. కొందుర్గు మండలం లూర్తునగర్‌ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వెలిశాయి. బాలాపూర్‌ మండలం బడంగ్‌పేట్‌ సర్వే నంబర్‌ 161 ఎర్రకుంట ఎఫ్‌టీఎల్‌లోని రెండు ఎకరాల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ వేసినా పట్టించుకున్న నాథుడు లేడు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది బాలాపూర్‌ రెవెన్యూ పరిధిలోని దేవతలగుట్ట. ఇక్కడి భూములను ప్రభుత్వం యూఎల్‌సీ (నిషేధిత) జాబితాలో చేర్చింది. విలువైన ఈ భూములపై స్థానిక అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఇప్పటికే ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఈ భూములను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టి.. నిర్మాణాలు సైతం చేపట్టింది. తాజాగా సర్వే నంబర్‌ 78, 80లోని మరికొంత భూమిని ఆక్రమించి.. ఇల్లీగల్‌ లే అవుట్‌ను సిద్ధం చేసింది. వీటిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది.

ఇది జల్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్‌ 177లో 17 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎత్తయిన గుట్ట. ఇప్పటికే దీనికి ఆనుకుని ఉన్న మెజార్టీ భూమి ఆక్రమణకు గురైంది. ఇది ప్రభుత్వ భూమి అని, అమ్మడం.. కొనడం నేరమని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి, యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతుండటం గమనార్హం.

దర్జాగా లే అవుట్లు.. అక్రమ నిర్మాణాలు

పట్టించుకోని అధికారులు

విలువైన భూముల ఆక్రమణ

ప్రభుత్వ బోర్డుల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement