నైపుణ్యహస్తం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యహస్తం

Mar 3 2026 9:16 AM | Updated on Mar 3 2026 9:16 AM

పది రోజులపాటు తర్ఫీదు పొందిన నేతలు ముగింపు సమావేశానికి హాజరైన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో సమావేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అరగంటపాటు చర్చ

వికారాబాద్‌: లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం వికారాబాద్‌లోనే గడిపారు. పది రోజులుగా కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్ర డీసీసీ అధ్య క్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. రాహుల్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి 10.15 గంటలకు ఎస్‌ఏపీ కళాశాల హెలిపాడ్‌కు చేరుకున్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మహేశ్‌కుమార్‌గౌడ్‌, వైఎస్‌ షర్మిల, శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్‌ టి.రామ్మోహన్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనన్య పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

పార్టీ పరిస్థితిపై ఆరా

అనంతరం రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, సీఎం, రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళాశాల ఆవరణలోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అరగంటపాటు చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అజహరుద్దీన్‌, వి.హన్మంతరావు, కేశవరావు, షబ్బీర్‌అలీ, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నా రు. అనంతరం అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి చేరుకున్నారు.

సమర్థవంతంగా శిక్షణ

సంఘటన సృజన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్‌ హరిత రిసార్ట్స్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులు, డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఇరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మహేశ్‌కుమార్‌గౌడ్‌, వైఎస్‌ షర్మిల, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్‌రావంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్‌ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపారు. అందరితో విడిగా ఫొటోలు దిగారు. సాయంత్రం 4.35 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.

డీసీసీ జిల్లా అధ్యక్షులకు ముగిసిన శిక్షణ

హంగూ ఆర్భాటం లేకుండా..

రాజకీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా రాహుల్‌గాంధీ పర్యటన కొనసాగింది. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు మినహా ఎలాంటి ఆర్భాటం లేకుండా పర్యటన సాగింది. మీడియాకు సైతం అనుమతి లేకుండా పార్టీ అంతర్గత కార్యక్రమాన్ని కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement