చేవెళ్ల: ఉపాధిహామీ పనులతో ప్రజలకు ఉపాధి కల్పించటంతో పాటు ఎలాంటి అవకతవకలు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టేలా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ ఎల్.శ్రీలత అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం మండలంలో ఏడాది కాలంలో జరిగిన ఉపాధిహామీ పథకం పనులపై 16వ విడత సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. మండలంలోని 37 గ్రామాల్లో ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జరిగిన ఏడాది ఉపాధిహామీ పనులపై ఆడిట్ చేపట్టినట్టు తెలిపారు. మొత్తం రూ.1,93,20,661 పనులు జరిగినట్లు చెప్పారు. జిల్లా అధికారి పీడీ శ్రీలత, అడిషనల్ డీఆర్‌డీఏ సుభాషిణి, అంబుడ్స్‌మెన్ సునీత, క్వాలిటీ కంట్రోలర్ సునీత, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొండయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ కాశన్న సమక్షంలో సామాజిక తనిఖీ నివేదికలు చదివి వినిపించారు. అవకతవకలపై అధికారులు మండిపడ్డారు. రికార్డులు సక్రమంగా లేని గ్రామాల సిబ్బందిని ఏం చేస్తున్నారంటూ మందలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ఎంపీఓ విఠలేశ్వర్‌జీ, ఉపాధిహామీ పథకం ఈసీ రాజశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ పథకం టీఏలు, ఎఫ్‌ఏలు, సిబ్బంది, ఉన్నారు.


