హుడాకాంప్లెక్స్: రోడ్లను ఆక్రమించుకొని అక్రమంగా వేసిన షెడ్లను అధికారులు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా షెడ్లు నిర్మించి చిరు వ్యాపారాలు చేస్తుండడంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో సోమవారం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరూర్‌గర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి అర్చన నేతృత్వంలో కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుంచి ఓమ్ని ఆస్పత్రి సర్వీసు రోడ్డు, కొత్తపేట నాగోల్ రోడ్డులోని మహాలక్ష్మి థియేటర్ రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన షెడ్లను చైతన్యపురి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో కూల్చివేశారు. ఈ క్రమంలో తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని చిరు వ్యాపారులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ వ్యాపారం చేసుకునే తమపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. దీంతో అధికారులు చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పి పంపించారు. కార్యక్రమంలో చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
చిరువ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదం


