ఫ్యూచర్ సిటీకి ‘అసైన్డ్’
ఏమీ చెప్పడం లేదు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
యాచారం: ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఫ్యూచర్‌సిటీకి తీసుకోవడం కోసం అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. మండల పరిధిలోని కొత్తపల్లిలో టీజీఐఐసీ పర్యవేక్షణలో 2,200 ఎకరాలు సేకరించి ఫ్యూచర్‌సిటీకి అప్పగించేలా కార్యాచరణకు దిగింది. ఇందులో భాగంగా పక్షం రోజులుగా గ్రామంలోని 32,178,182,222,242,317 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అసైన్డ్ భూమిని సర్వే చేసింది.
రైతుల ఆందోళన
అధికారులు సేకరించాలనుకున్న భూమిలో 600 నుంచి 700 ఎకరాలకు పైగా సాగుకు అనువుగా ఉంది. దాదాపు 200 మందికి వరకు పేద రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే భూ పంపిణీ పథకం కింద గ్రామంలోని అర్హులైన పేద రైతులకు అసైన్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇందిరజలప్రభ, ఉపాధి హామీ పథకం కింద పంపిణీ చేసిన భూముల్లో రూ.లక్షలాధి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. బోరుబావులు తవ్వించడం, కూరగాయల, పండ్లతోటల పెంపకం కోసం రైతులు రుణాలు కూడా పొందారు. పాడిపశువులు, గొర్రెల, మేకల పెంపకం కోసం రుణాలు తీసుకుని షెడ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అవే భూములను సర్కార్ తీసుకుంటుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిహారం ఇచ్చేది తేల్చకుండానే భూసేకరణ ప్రక్రియ చేపట్టడంపై మండిపడుతున్నారు. సర్వే చేయడం, హద్దురాళ్లు పాతడం వంటి పనులు చకచకా చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.
పరిహారం తేల్చకుండానే పనులా..
ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో గుంతలు తీసి టీజీఐఐసీ బోర్డులు పాతడానికి మంగళవారం రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా ఏ విధంగా బోర్డులు పాతుతారని నిలదీశారు. సమాచారం అందుకున్న సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఆందోళనకారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీజీఐఐసీ బోర్డులు, ఇతక బాక్స్‌లను పంచాయతీ కార్యాలయానికి తరలించారు.
భూముల సేకరణకు కసరత్తు
ఇప్పటికే సర్వే చేసిన అధికారులు
సాగులో ఉన్న రైతుల ఆందోళన
పరిహారం తేల్చకుండా పనులపై ఆగ్రహం
తాజాగా అధికారులను అడ్డుకున్న వైనం
గ్రామంలోని భూములను దేని కోసం తీసుకుంటున్నారు.. సేకరించే భూములకు పరిహారం ఎంత చెల్లిస్తారు.. అనే విషయమై ఎవరూ ఏమీ చెప్పడం లేదు. పరిహారం తేల్చకుండానే హద్దురాళ్లు పాతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
– కావలి జగన్, మాజీ ఉప సర్పంచ్, కొత్తపల్లి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేశాం. హద్దురాళ్లు పాతితే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. పరిహారం ఎంత ఇచ్చేది అనే విషయం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. మేం చెప్పలేం.
– అయ్యప్ప, తహసీల్దార్, యాచారం
ఫ్యూచర్ సిటీకి ‘అసైన్డ్’
ఫ్యూచర్ సిటీకి ‘అసైన్డ్’


