బీఫాంలపై వీడిన ఉత్కంఠ
కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థి రాముగౌడ్
చేవెళ్ల: అధికార పార్టీలో బీ ఫారాల పంచాయితీ కుంపటి రాజేసింది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీలోని 13 వార్డులో ఆ పార్టీ ఒక్కరికి ముందుగా బీ ఫాం ఇస్తే, దాన్ని రద్దు చేస్తూ మరొకరు టికెట్ తెచ్చుకున్నారు. ఆ వార్డులో కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులు కాసుల రమేశ్‌గౌడ్, కాసుల రాముగౌడ్ పోటీ పడ్డారు. టికెట్ నాకంటే నాకే వస్తుందనే ధీమాతో నామినేషన్లు వేశారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. చివరకు సోమవారం పార్టీ అధిష్టానం రమేశ్‌గౌడ్‌కు బీ ఫాం ఇచ్చింది. దీంతో మరో అభ్యర్థి రాముగౌడ్ కన్నీరు పెట్టుకుంటూ ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్‌తో చర్చించారు. రాముగౌడ్ రెబల్‌గా పోటీ చేస్తే పార్టీకి భారీగా నష్టం జరుగుతదని భావించినా నాయకులు మొదట ఇచ్చిన బీ ఫారంను రద్దు చేశారు. మంగళవారం రాముగౌడ్ కాంగ్రెస్ పార్టీ బీ ఫాంతో ఎన్నికల అధికారులకు సమర్పించారు.
కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని వార్డుల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేశామని, షాద్‌నగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో పార్టీ అభ్యర్థులకు ఆయన బీఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, క్షణం విరామం లేకుండా పనిచేస్తూ పట్టణాభివృద్ధికి ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు పట్టణంలో రెండేళ్ల కాలంలో తాము చేసిన పనులను చూపిస్తూ గౌరవంగా ఓట్లు అడగాలన్నారు. ఎన్నికల్లో ఎవరి సిఫారసు లేకుండా పాదర్శకంగా సర్వేల ఆధారంగా వార్డుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. టికెట్లు ఆశించి భంగపడిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌వైపే ఉన్నారని, షాద్‌నగర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల కాలంలో పట్టణం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయిస్తున్నారన్నారు. సమావేశంలో నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, బాబర్‌ఖాన్, విశ్వం, బస్వం, వన్నాడ ప్రకాష్‌గౌడ్, రఘునాయక్, తిరుపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, విశాల తదితరులు పాల్గొన్నారు.
బీఫాంలపై వీడిన ఉత్కంఠ


