
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి
● జిల్లాలో 33 కేంద్రాలు ప్రారంభించాలి
● అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 ధర లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు వివరించారు. సన్నరకం, దొడ్డు రకం సెంటర్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెంటర్లలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, కంట్రోల్ రూమ్ నంబర్లు ప్రదర్శించాలని, రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సివిల్ సప్లయ్ మేనేజర్ హరీశ్, డీసీఎస్‌ఓ వనజాత, డీఆర్‌డీఓ శ్రీలత, డీసీఓ సుధాకర్, డీఏఓ ఉష, డీఎంఓ రియాజ్, డీఎల్‌ఎంఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు .