రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి

Oct 15 2025 8:02 AM | Updated on Oct 15 2025 8:02 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి

అంతిమ యాత్రలో పాల్గొన్న ఆచారి

కడ్తాల్‌: మండల కేంద్రానికి చెందిన బీజేపీ కార్యకర్త జల్కం శేఖర్‌(36) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి మంగళవారం పరామర్శించారు. జల్కం శేఖర్‌ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసారు.అదే విధంగా బాధిత కుటుంబాన్ని వివిధ పార్టీల, సంఘాల నాయకులు పరామర్శించారు.

పంచాయతీ ట్రాక్టర్‌ నుంచి బ్యాటరీ చోరీ

నందిగామ: పార్క్‌ చేసిన చాకలిదాని గుట్టతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ నుంచి గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి బ్యాటరీ చోరీ చేశారు. కారోబార్‌ శ్రీనివాస్‌ తెలిపిన ప్రకారం.. సోమవారం గ్రామంలో పనులు చేసిన తర్వాత సాయంత్రం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ట్రాక్టర్‌కు తాళం వేసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ట్రాక్టర్‌ తీసుకెళ్లేందుకు వెళ్లగా బ్యాటరీ చోరీ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఇదే పంచాయతీలో పలుమార్లు దొంగలు పడ్డారు. ఇప్పటికై నా పోలీసులు దర్యాప్తు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అదృశ్యమైన మహిళ.. శవమై తేలింది

మీర్‌పేట: బడంగ్‌పేటలో అదృశ్యమైన మహిళ మీర్‌పేట మంత్రాల చెరువులో శవమై తేలింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన ప్రకారం. బడంగ్‌పేట సమతానగర్‌కు చెందిన మీసాల కమల (55)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కమల ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు రాజశేఖర్‌ అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంత్రాల చెరువులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన వాకర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హైడ్రా సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని వెలికితీసి కమలగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కమల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిందని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్‌

శంషాబాద్‌: విమానాశ్రయంలో బాంబులు పెడితే వివిధ ఏజెన్సీలన్నీ సమన్వయంగా సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు ప్రతి సంవత్సరం నిర్వహించిన మాదిరిగా ఈ ఏడాది బాంబులు పెడితే కలిగే నష్టం..దానిని నివారించే విధానంపై డ్రిల్‌ చేపట్టారు. కార్గో ఏరియాలో చేపట్టిన ఈ డ్రిల్‌లో సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల బృందంతో పాటు రక్ష సెక్యూరిటీ, వైద్యులు, రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక పోలీసులు పాల్గొన్నారు. తనిఖీలు, నిర్వీర్యం, వైద్యసాయం తదితర అంశాలపై మాక్‌డ్రిల్‌ విజయవంతంగా పూర్తిగా చేశారు.

ముజ్రా పార్టీ భగ్నం

మహేశ్వరం: మహేశ్వరం ఠాణా పరిధిలోని కొరుపోలు చంద్రారెడ్డి (కేసీఆర్‌ రిసార్ట్స్‌) రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీ మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు భగ్నం చేశారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలోని కేసీఆర్‌ రిసార్ట్స్‌లో మంగళవారం వేద అగ్రికల్చర్‌ ఇన్నోవేషన్‌ సీడ్‌ కంపెనీ డైరెక్టర్‌ గాజులరామారానికి చెందిన తిరుపతి రెడ్డి, రాందాస్‌పల్లికి చెందిన రాక్‌స్టార్‌ హైబ్రిడ్‌ సీడ్‌ కంపెనీ డైరెక్టర్‌ సైదారెడ్డి వేర్వేరుగా విత్తన కంపెనీ డీలర్లకు విందు ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు, 52 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రెండు కాటన్‌ల బీర్లు, మూడు ఫుల్‌బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్‌ యజమాని రాకేశ్‌రెడ్డి, ఈవెంట్‌ మేనేజర్‌ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరో నలుగురు బాలురపైనా లైంగిక దాడి!

సైదాబాద్‌: సైదాబాద్‌ జైలు గార్డెన్‌లోని ప్రభుత్వ బాలల సదనంలో ఒక బాలుడిపై ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి లైంగిక దాడి చేయడం కలకలం సృష్టించిన సంగతి విదితమే. అయితే పోలీసుల విచారణలో అతడు మరో నలుగురు బాలురిపైనా లైంగిక దాడులు చేశాడని తేలినట్లు తెలుస్తోంది. బాలుడిపై లైంగిక దాడి ఘటనను సీరియస్‌గా విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నామయని సమాచారం. ప్రస్తుతం సదనంలో 80 మంది బాలలు ఉండగా వారందరితో పోలీసులు ఒక్కొక్కరిగా మాట్లాడి విషయాలు రాబడుతున్నారు. ప్రస్తుతం సదనంలో కాకుండా ఇండ్లకు వెళ్లిన వారిని సైతం వారు విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ బాలుడిపై దాడి విషయం వెలుగులోకి వచ్చిన తరువాత జువైనల్‌ విభాగం ఉన్నతాధికారులు మహిళా సూపరింటెండెంట్‌ మైథిలిని దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆమె పూర్తి వివరాలతో నివేదికను అధికారులకు సమర్పించారు. ఇప్పటికే బాలుడిపై దాడి ఘటనలో నిందితుడైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రహమాన్‌ను విధుల నుంచి అధికారులు తొలిగించారు. హెడ్‌ సూపర్‌వైజర్‌ షఫీని సస్పెండ్‌ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగులకు చార్జి మెమో జారీ చేశారు. సైదాబాద్‌ పోలీసుల విచారణ పూర్తయితే ప్రభుత్వ బాలల సదనంలో దాడుల విషయమై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకా శం ఉంది. బాలల సదనంలో లైంగిక దాడి ఘటనపై కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు పూర్తి నివేదిక పంపాలని అడిగారని తెలుస్తోంది.

హెచ్‌సీఏలో నకిలీ బర్త్‌ సర్టిఫికెట్ల కలకలం

సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌సీఏపై మరో వివాదంవెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏలో నకిలీ, డబుల్‌ బర్త్‌ సర్టిఫికెట్లతో పలువురు క్రీడాకారులు ప్రవేశం పొందినట్లు ఓ బాధితుడి తండ్రి అనంత్‌ రెడ్డి మంగళవారం ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌ బాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అండర్‌– 16, అండర్‌–19, అండర్‌–23 లీగ్‌ మ్యాచుల్లో పలువురు ప్లేయర్లు డబుల్‌ బర్త్‌ సర్టిఫికెట్లతో ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్‌లో ఆడే విధంగా హెచ్‌సీఏ అవకాశం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతంలో ఆరుగురు ప్లేయర్లను గుర్తించిన బీసీసీఐ..వారిపై నిషేధం విధించిందని ఆయన గుర్తు చేశారు. ఎక్కువ వయసు ఉన్న వారికి ఇలా అక్రమమార్గంలో లీగ్‌లో ఆడే అవకాశం ఇవ్వడం వల్ల ప్రతిభ ఉన్న నిజమైన క్రీడాకారులకు నష్టం వాటిల్లుతుందని ఆయన వాపోయారు. అవినీతికి పాల్పడుతూ టాలెంట్‌ లేకున్నా ప్లేయర్లను ఆడనిస్తున్న హెచ్‌సీఏ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి 1
1/4

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి 2
2/4

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి 3
3/4

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి 4
4/4

రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement