
నిధులు అందవు..పనులు సాగవు
● రెండేళ్లుగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణం
● ఎమ్మెల్యే ఆదేశించినా పురోగతి లేని వైనం
● ఇబ్బంది పడుతున్న ప్రజలు
యాచారం: మాడ్గుల–యాచారం మండలాల సరిహద్దు కలిసే రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా పనుల్లో పురోగతి లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఫిర్యాదులు చేసిన స్పందన లేదని వాపోతున్నారు. 2023 ఆగస్టు 24న అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొత్తపల్లి–కొత్తపల్లి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు మంజూరు చేయించి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో గుట్టల మధ్య నుంచి వెళ్లే మార్గాన్ని బీటీ రోడ్డుగా మారిస్తే యాచారం–మాడ్గుల మండలాల సరిహద్దు ప్రయాణికుల రాకపోకలకు సులభం అవుతుంది. పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
కొత్తపల్లి–కిషన్‌పల్లి రోడ్డు అంతే..
కొత్తపల్లి నుంచి మాల్ మార్కెట్‌కు చేరుకోవడానికి కిషన్‌పల్లి వరకు అదే రోజు పంచాయతీ రాజ్ శాఖ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పూర్తయితే కొత్తపల్లి గ్రామస్తులకు ఆరుకిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. రెండేళ్లు దాటినా రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకనే సాగడంతో కొత్తపల్లి గ్రామస్తులకు ఇబ్బంది తప్పడం లేదు.
రూ.3.5 కోట్ల బకాయి
కొత్తపల్లి–కొత్తపల్లి తండా వరకు ఆరు కిలోమీటర్లు, కొత్తపల్లి–కిషన్‌పల్లి వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ నుంచి రూ.7.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేటి వరకు దాదాపు రూ.3.5 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. ప్రభుత్వం నుంచి నయా పైసా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు సాగడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారే తప్పా.. బిల్లులు ఎందుకు రాలేదో చెప్పడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నా రు. వడ్డీ తెచ్చి పనులు చేపడితే సకాలంలో బి ల్లులు అందక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సగం నిధులు ఇప్పించినా సకాలంలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

నిధులు అందవు..పనులు సాగవు