
సోలార్ సొబగులు!
రూ.కోటితో ప్రభుత్వ ఆఫీసులపై ప్యానళ్ల ఏర్పాటు నెలరోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్న టీజీ రెడ్‌కో ‘మోడల్ సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం
పీఎం సూర్యఘర్ పథకానికి నందిగామ ఎంపిక
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ షాద్‌నగర్: జిల్లాలోని నందిగామ సిగలో ఇక సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ గ్రామంలోని ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, సంక్షేమ హాస్టళ్లు, రక్షకభట నిలయాలు ఇక పూర్తిగా సోలార్ విద్యుత్ కాంతులతో వెలిగిపోనున్నాయి. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను టీజీ రెడ్‌కో నెల రోజుల్లో సిద్ధం చేసి, కేంద్ర సంప్రదాయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖకు అందజేయనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయా ప్రభుత్వ భవనాలపై ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నారు.
మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు..
సోలార్ విద్యుత్‌ను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.800 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా 800 గ్రామాలను ‘సోలార్ మోడల్ విలేజ్’లుగా తీర్చి దిద్దాలని నిర్ణయించింది. ఇందుకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఐదు వేల జనాభా కలిగి ఉండాలనే నిబంధన విధించింది. ఈ మేరకు జిల్లాలోని ఆరుట్ల, అబ్దుల్లాపూర్‌మె ట్, పాల్మాకుల, మాడ్గుల, షాబాద్, మహేశ్వరం, దండు మైలారం, రాయపోలు, ఇన్ముల్‌నర్వ, కడ్తాల్, ఆలూరు, చేవెళ్ల, కొందుర్గు రెవెన్యూ విలేజీలను గుర్తించి, సర్వే చేపట్టింది. ఇప్పటికే సోలార్ విద్యుత్‌పై అవగాహన కలిగి ఉండి, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని మెజార్టీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న నందిగామను మోడల్ విలేజ్‌గా ఎంపిక చేసింది.
పోటీపడిన మరో 13 గ్రామాలు..
షాబాద్‌లో రెండు యూనిట్ల ద్వారా ఇప్పటికే 21 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, మహేశ్వరంలో ఎనిమిది యూనిట్ల నుంచి 670, చేవెళ్లలో 17 యూనిట్ల నుంచి 87.2, రాయపోలులో మూడు యూనిట్ల నుంచి 37, కడ్తాల్‌లో తొమ్మిది యూనిట్ల నుంచి 87.3, ఆలూరులో మూడు యూనిట్ల నుంచి 12, కొందుర్గులో మూడు యూనిట్ల నుంచి 1,009 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నందిగామలో పది యూనిట్ల నుంచి ఏకంగా 1,939 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. నెల రోజుల్లో సమగ్ర నివేదికను రూపొందించి ఎంఎన్‌ఆర్‌కు పంపనుంది.
25 ప్రభుత్వ భవనాల గుర్తింపు
అన్ని అనుమతులు వచ్చిన తర్వాత టెండర్ల ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయనుంది. రూ.కోటి ఖర్చుతో ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పంచాయతీ, మండల కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల గిడ్డంగులు సహా సుమారు 25 ప్రభుత్వ భవనాలపై కిలో వాట్ నుంచి మూడు కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పలకలను అమర్చనుంది. ప్రభుత్వ భవనాలపై పూర్తి ఉచితంగా ప్యానళ్లు ఏర్పాటు చేయనుండగా, స్వయం సహాయ సంఘాల భవనాలకు 10 శాతం ఆర్థిక సహాయం అందించనుంది. ఆయా భవనాలపై ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించనుంది. దీంతో నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు విముక్తి కల్పించనుంది.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఇలా
సామర్థ్యం ప్రభుత్వ సబ్సిడీ విద్యుత్ ఉత్పత్తి
ఒక కిలోవాటు రూ.30 వేలు 120 యూనిట్లు
రెండు కిలోవాట్లు రూ.60 వేలు 240 యూనిట్లు
మూడు కిలోవాట్లు రూ.78 వేలు 360 యూనిట్లు
గృహాలకు సబ్సిడీ
ప్రభుత్వ భవనాలపైనే కాకుండా గ్రామంలోని తమ ఇళ్లపై ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావించే గృహ వినియోగదారులకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఒక కిలోవాట్ నుంచి మూడు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https:// pmsuryaghar. gov. in పోర్టల్‌లో లాగినై ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ యూఎస్సీ నంబర్‌ను ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి. దీని ద్వారా ఎన్ని కిలోవాట్స్ సోలార్ పరికరాలు అవసరమనే వివరాలను నమోదు చేయాల్సి ఉంది. తర్వాత విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తారు. ఇంటిపై ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానల్స్‌తో గృహ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పెట్టిన పెట్టుబడిని.. ఐదేళ్ల వ్యవధిలోనే తిరిగి పొందొచ్చు. ఇలా ఒకసారి ఏర్పాటు చేసిన ప్యానల్స్ 25 ఏళ్ల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు టీజీ రెడ్‌కో జిల్లా మేనేజర్ టి.వేణుగోపాల్ తెలిపారు.