కందుకూరు: దేశవ్యాప్తంగా వర్చువల్‌గా నిర్వహించిన వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025 కార్యక్రమం సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో నిర్వహించారు. ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ పాల్గొనగా ఏఐఎం, నీతిఆయోగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో కందుకూరు కేజీబీవీ విద్యార్థులు తమ ఆవిష్కరణలను వివరించారు. 9వ తరగతికి చెందిన కల్పన శ్రీక్లాత్ ప్రొటెక్షన్ ఫ్రం రెయిన్‌శ్రీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. బట్టలు ఆరేసే తీగలకు సెన్సార్ ఏర్పాటు చేసి వర్షం కురిసినప్పుడు తడవకుండా అవంతట అవే నీడలోకి వచ్చి, మళ్లీ వర్షం తగ్గిన వెంటనే తిరిగి యథాస్థానంలోకి వచ్చేలా ఆవిష్కరణను వివరించి ఆకట్టుకుంది. వర్షం పడుతుండగానే తల్లి బట్టలు తడవకుండా పరుగులు తీసే దృశ్యం తనకు ప్రేరణ అయినట్లు తెలిపింది. తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు వివరించి అభినందనలు అందుకుంది. ఈ సందర్భంగా డీఈఓ సుశీంద్రరావు, జిల్లా సైన్స్ అధికారి ఎ.శ్రీనివాస్‌రావు, ఎంఈఓ హెచ్.నర్సింహులు, కేజీబీవీ జిల్లా డెవలప్‌మెంట్ అధికారి సుజాత, ప్రిన్సిపాల్ భార్గవి, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చీఫ్ మేనేజర్ రామ్ తదితరులు విద్యార్థినిని అభినందించారు.