
సీజేఐపై దాడి యత్నానికి నిరసన
ఇబ్రహీంపట్నం రూరల్: ఆధిపత్య శక్తుల ప్రభావంతోనే సీజేఐ గవాయిపై దాడి జరిగిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై దాడి చేసిన అడ్వొకేట్ రాకేష్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం ఎంఆర్‌పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. బీఆర్ గవాయిపై జరిగిన దాడిని భారత న్యాయవ్యవస్థ మీద, రాజ్యంగ స్ఫూర్తి మీద దాడిగా అభివర్ణించారు. కుల, మతాల పేరుతో విద్వేషాన్ని నింపుకొని దాడులకు దిగడం అనాగరికపు చర్యఅని పేర్కొన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేసి దాడి వెనక ఉన్న శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో మండల కార్యాలయాలను ముట్టడిస్తామని, 22న చలో హైదరాబాద్ పేరుతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు బాబు, బత్తిన సుధాకర్, కృష్ణ, రవి, రమేష్, సతీష్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.