చందుర్తి(వేములవాడ): ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్ అక్కడికి చేరుకొని వాహనాలు నిలిచిపోయాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ధర్నా విరమించాలని కోరగా ససేమిరా అన్నారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేయడంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా లాగేశారు. అక్కడి నుంచి వారు స్థానిక తహసీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకొని నిరసనకు దిగారు. తహసీల్దార్ భూపతి సంబంధిత అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ధాన్యం కోతలు విధించకుండా కొనుగోలు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, చందుర్తి సింగిల్ విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు దప్పుల ఆశోక్, నాయకులు ఏనుగు శ్రీనివాస్, మరాఠి మల్లిక్, బత్తుల కమలాకర్, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.


