కల్లాల్లో కష్టాలు
ఈ రైతు చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన నాయిని బాపురెడ్డి. 8 ఎకరాల పొలం కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. రెండురోజుల కిత్రం కురిసిన వర్షానికి కల్లంలో నీరు నిలిచి ధాన్యం మొలకలు వచ్చాయి. భూమి తడారక ధాన్యం తేమ శాతం అధికంగా ఉండడంతో మొలకలు వస్తున్నాయి. పక్కనే ఇతర రైతుల కుప్పులు ఉండడంతో వడ్లను ఆరబోయడం కష్టంగా మారింది. కనీసం తేమ శాతం వచ్చిన వడ్లను కొంటే, కేంద్రంలో ఇతర రైతులు ఆరబోసుకునేందుకు వీలు ఉంటుంది.
చందుర్తి(వేములవాడ): పంట పండించేందుకు ఆరుగాలం కష్టపడ్డ రైతులు అమ్ముకునేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నానా తిప్పలు పడుతున్నారు. కోతలు కోసి వారం రోజులుగా కల్లాల్లోనే ధాన్యం ఆరబోస్తుండగా, ఇటీవల కురిసిన భారీ వర్షానికి తేమ శాతం తగ్గడం కష్టంగా మారింది. దీనికి తోడు తరుచూ ఆకాశంలో మబ్బులతో రైతులకు కంటి నిండా కునుకు కరువైంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి జిల్లావ్యాప్తంగా కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
కొట్టుకుపోయిన ధాన్యం
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): మండలంలో ఆదివారం వేకువజామున కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది. మండలంలోని రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల తిమ్మాపూర్ గ్రామాల్లోని కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమశాతం 17 వచ్చినా నిర్వాహకులు తూకం వేయడం లేదని వాపోతున్నారు. అధికారులు నష్టపోయిన ధాన్యాన్ని పరిశీలించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
కల్లాల్లో కష్టాలు
కల్లాల్లో కష్టాలు


