పత్తిని దళారులకు అమ్ముకోవద్దు
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోళ్లు జరుగుతాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తిని కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. బుకింగ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని ఏఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 ఉందని, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. తడిసిన వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దిగాలు పడాల్సిన అవసరం లేదన్నారు. ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, డైరెక్టర్లు తిరుపతిగౌడ్, మచ్చ రాజేశం, సత్యారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, గుడిసె ఐలయ్యయాదవ్, రమణారెడ్డి, మహేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, తీగల పుష్పలత, ఎలుక రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
బస్సును పునరుద్ధరించాలని వినతి
కరీంనగర్ నుంచి బెజ్జంకి, రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లి మీదుగా ఇల్లంతకుంట వరకు ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కవ్వంపల్లికి విన్నవించారు. కరీంనగర్ డిపో మేనేజర్‌తో మాట్లాడి బస్సు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


