
కోడెలను వ్యవసాయానికి వినియోగించాలి
● పక్కదారి పట్టించే వారిపై చర్యలు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం.హరిత ● 102 జతల రాజన్న కోడెలు రైతులకు అందజేత
వేములవాడఅర్బన్: రాజన్న కోడెలను వ్యవసాయానికి వినియోగించుకోవాలని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలోని కోడెలను శుక్రవారం రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామి వారికి కోడెలను కట్టే సంస్కృతి వేములవాడలోనే ఉందన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కోడెమొక్కుల ద్వారా వచ్చిన కోడెలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే రైతులకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈ కోడెలను రైతులు పక్కదారి పట్టించొద్దని, తనిఖీ చేయిస్తామన్నారు. త్వరలోనే 40 ఎకరాలలో అధునాతన గోశాల పనులు మొదలుపెడతామన్నారు. కోడెమొక్కులు చెల్లించే భక్తులు పాలు మరిచిన తర్వాత జీవాలను అందజేయాలని కోరారు. కలెక్టర్ ఎం.హరిత మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే కోడెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 102 జతల కోడెలను పంపిణీ చేశామన్నారు. ఆలయ ఈవో రమాదేవి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.