
42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
● నేటి బంద్‌కు సంపూర్ణ మద్దతు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లును ప్రవేశపెట్టగా.. తాను బలపరిచే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, హైకోర్టు విచారణలో ఉన్న 42 శాతం బీసీల రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండి కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. శనివారం నిర్వహించ తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు బంద్ పాటించి మద్దతు తెలపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, వైద్య శివప్రసాద్, యెల్లె లక్ష్మీనారాయణ, గోనె ఎల్లప్ప, సూర దేవరాజు, బీసీ సంఘాల నాయకులు బొప్ప దేవయ్య, తొట్ల రాములుయాదవ్, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాగతం పలుకుదాం
వేములవాడ: వేములవాడకు ఈనెల 19న వస్తున్న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీస్వామికి ఘనంగా స్వాగతం పలుకుదామని, అందరూ తరలిరావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ఆలయ ఓపెన్‌స్లాబ్‌లో శుక్రవారం విధుశేఖర భారతీస్వామి ధర్మ విజయయాత్ర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. పట్టణంతోపాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు వేములవాడలోని తెలంగాణ చౌక్ వద్దకు అందరూ చేరుకొని స్వామివారికి స్వాగతం పలకాలని కోరారు.