
చేపా చేపా ఎప్పుడొస్తావ్!
ఉమ్మడి జిల్లాలో చేపపిల్లల పంపిణీ వివరాలు
● తప్పని ‘మీన’మేషాలు! ● చేపపిల్లల పంపిణీపై నీలినీడలు ● అదను దాటితే నష్టమంటున్న మత్స్యకారులు
సిరిసిల్ల/సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఉచితంగా విడుదల చేసే చేపపిల్లల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచింది. పలుచోట్ల టెండర్లు దాఖలు కాలేదు. మరికొన్ని చోట్ల దాఖలైనా అర్హత లేకుండాపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ శుక్ర వారం ప్రారంభం కాగా ఉమ్మడి జిల్లాలో మొదలుకాలేదు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్ల వ్యయంతో చేపపిల్లలను వదులుతోంది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అ క్రమాలతో ఈ పథకం లోపభూయిష్టంగా మారుతోంది. పంపిణీ ఆలస్యంగా చేపట్టడం, చేపపిల్లల పరిమాణం చిన్నగా ఉండడంతో.. పూర్తిస్థాయిలో ఎదుగక మత్స్యకారులు నష్టపోతున్నారు.
6.96 కోట్ల చేపపిల్లలు.. 3,133 చెరువులు
ఉమ్మడి జిల్లాలోని సుమారు 56 వేల మంది మత్స్యకారులు చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ వాటిని విడుదల చేయకపోవడంతో వేట సీజన్‌ను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
● కరీంనగర్ జిల్లాలో టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు మందుకురాకపోగా, పెద్దపల్లిలో ఇద్దరు టెండర్లు వేసినా అర్హత లేనందున తిరస్కరించా రు. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో రెండు టెండర్లు దాఖలైనా.. సీడ్ లభ్యతపై ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత టెండర్లు ఫైనల్ చేయనున్నారు.
రాష్ట్రంలో ఒక్క నారాయణపేటలోనే..
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. నారాయణపేట జిల్లా తప్ప రాష్ట్రంలో మరెక్కడా విడుదల చేయలేకపోయింది. రెండేళ్లకు సంబంధించి బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించలేదని, దీంతోనే వారు పంపిణీ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకు న్నాయి. టెండర్ల ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధంతో పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
ఎదుగుదలపై ప్రభావం
కిలో బరువు చేప పెరగాలంటే కనీసం ఐదు నెలల సమయం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరులోగా ప్రాజెక్టులు, చెరువుల్లో చేపపిల్లలు విడుదల చేసేవారు. ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలాఖరులోగానైనా వదిలితే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చేపలు పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరింత జాప్యం చేస్తే ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి తర్వాత పంపిణీ
పెద్దపల్లి జిల్లాలో చేపల సరఫరా కోసం రెండు బిడ్లు వచ్చాయి. వీరికి అర్హత లేక తిరిస్కరించాం. సమయం లేనందున మరోసారి టెండర్లు ఆహ్వానిస్తాం. ప్రత్యామ్నాయంగా ఇతర జిల్లాల కాంట్రాక్టర్లతో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాం. దీనికి సంబంధించి ఉన్నాతాధికారులకు లేఖ రాశాం. దీపావళి తర్వాత పంపిణీ చేస్తాం.
– నరేశ్‌నాయుడు,
మత్స్యశాఖ జిల్లా అధికారి, పెద్దపల్లి
జిల్లా చెరువులు లక్ష్యం(లక్షల్లో) ఖర్చు(లక్షల్లో)
జగిత్యాల 696 169.33 224.11
కరీంనగర్ 921 220.04 217.98
పెద్దపల్లి 1,076 158.82 158.30
సిరిసిల్ల 440 148.28 175.87
మొత్తం 3,133 696.47 776.26

చేపా చేపా ఎప్పుడొస్తావ్!