
జర్నలిజంపై కేసులు అప్రజాస్వామికం
ఏపీలో సాక్షి ఆఫీసుల్లో దాడులు ఆపాలి
పోలీసులను అడ్డుపెట్టి నిజాన్ని ఆపలేరు
సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
సిరిసిల్లటౌన్: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులపై కేసులు బనాయించడం అప్రజాస్వామికమని టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి అధ్యక్షుడు కరుణాల భద్రాచలం అన్నారు. ఏపీ ప్రభుత్వం పోలీసులతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంపై శుక్రవారం సిరిసిల్లలో జర్నలిస్టుల సంఘాలు మండిపడ్డాయి. ఈమేరకు స్థానిక ప్రెస్‌క్లబ్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీలో పోలీసులు సాక్షి కార్యాలయాల్లో తనిఖీలు చేస్తూ.. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. పాత్రికేయులను బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్న పోలీసులు, ప్రభుత్వం తీరు సరికాదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేయాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు తడుక విశ్వనాథం, వూరడి మల్లికార్జున్, సామల గట్టు, మేడి కిషన్, శిరీష, చింతకింది శ్యామ్, మిట్టపల్లి కాశీనాథ్, సదానందం, మధు, దేవేందర్, రాజేంద్రప్రసాద్, సల్మాన్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.