బీసీ బంద్‌ సంపూర్ణం | - | Sakshi
Sakshi News home page

బీసీ బంద్‌ సంపూర్ణం

Oct 19 2025 6:31 AM | Updated on Oct 19 2025 6:31 AM

బీసీ

బీసీ బంద్‌ సంపూర్ణం

● మూతపడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు ● పార్టీల వారీగా బంద్‌కు మద్దతిస్తూ ప్రదర్శనలు

● మూతపడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు ● పార్టీల వారీగా బంద్‌కు మద్దతిస్తూ ప్రదర్శనలు

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా శనివారం బీసీల బంద్‌ సంపూర్ణంగా.. ప్రశాంతంగా జరిగింది. బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ నాయకులిచ్చిన బంద్‌ పిలుపు స్వచ్ఛందంగానే విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో తెల్లవారుజామునే వివిధ రాజకీయ పార్టీ నేతలు కొత్త బస్టాండులోని ఆర్టీసీ డిపో గేటు ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా కట్టడి చేశారు. న్యాయమైన డిమాండ్‌తో పోరాటం సాగిస్తున్నామని, తమకు సహకరించాలని సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌ ప్రకాశ్‌రావును నాయకులు కోరగా.. బస్సులు డిపోను విడిచి బయటకు రాలేదు. సినిమా థియేటర్లు, పెట్రోల్‌బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు. హోటళ్లు, కిరాణ దుకాణాలు సైతం మధ్యాహ్నం వరకు తెరుచుకోలేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే సిరిసిల్ల పాతబస్టాండు, గాంధీచౌక్‌, పెద్ద బజారులు బోసిపోయాయి. నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా కూరగాయల మార్కెట్‌, రైతు బజారు, మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు యథావిధిగా కొనసాగాయి. బస్సుల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హైదారాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌, కామారెడ్డి, సిరికొండ ప్రాంతాలకు వెళ్లే వారు కార్లు, ఆటోల్లో ప్రయాణించారు. బీసీ జేఏసీ నాయకులు పర్శ హన్మాండ్లు, గొనె ఎల్లప్ప, చొక్కాల రాము, గోలి వెంకటరమణ, బొప్ప దేవయ్య, రాగుల రాములు ర్యాలీ తీశారు.

కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్‌, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, ప్రభాకర్‌, యెల్లె లక్ష్మీనారాయణ, కల్లూరి చందన, బూర యాదగిరి, ముండ్రాయి శ్రీనివాస్‌ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. పట్టణంలో తిరుగుతూ దుకాణదారులతో బంద్‌ చేయించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సిరిసిల్ల అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ర్యాలీ తీశారు. బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, శ్రీసెస్‌శ్రీ డైరెక్టర్‌ దార్నం లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్‌, బొల్లి రామ్మోహన్‌, అగ్గి రాములు, మ్యాన రవి, అర్బన్‌ బ్యాంకు వైస్‌చైర్మన్‌ అడ్డగట్ల మురళి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు మూషం రమేశ్‌, కోడం రమణ, సూరం పద్మ, అన్నల్‌దాస్‌ గణేశ్‌, మిట్టపల్లి రాజమల్లు, రాపెల్లి రమేశ్‌ పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిరిసిల్ల టౌన్‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

నోటికాడి బుక్క తీసేయొద్దు

– ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, బీసీ బిల్లు అమలుపై ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సిందిగా గవర్నర్‌కు పంపామని.. బీసీలకు నోటికొచ్చిన బుక్కను తీసివేయొద్దని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్‌ పిలుపులో భాగంగా శనివారం వేకువజామున వేములవాడ డిపో గేటు ఎదుట బైఠాయించారు. విప్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీసీ బిల్లుపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద బీసీ సంఘాల ధర్నాకు బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీపీఎం నాయకులు ముక్తికాంత అశోక్‌, బీజేపీ నాయకులు నందిపేట సుదర్శన్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఐ వీరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

స్పృహ తప్పిన కాంగ్రెస్‌ నాయకుడు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండల కేంద్రంలో బీసీ బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయ్‌గౌడ్‌ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే తోటి నాయకులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ జీవనజ్యోతి చికిత్స అందించారు. విజయ్‌గౌడ్‌ కోలుకొని వల్లంపట్లలోని తన ఇంటికి వెళ్లాడు.

బీసీ బంద్‌ సంపూర్ణం1
1/3

బీసీ బంద్‌ సంపూర్ణం

బీసీ బంద్‌ సంపూర్ణం2
2/3

బీసీ బంద్‌ సంపూర్ణం

బీసీ బంద్‌ సంపూర్ణం3
3/3

బీసీ బంద్‌ సంపూర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement