
టపాసుల దుకాణాలు సిద్ధం
జిల్లా వ్యాప్తంగా 60 దరఖాస్తులు సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద టపాసుల దుకాణాలు నిబంధనలు పాటించాలంటున్న అధికారులు
సిరిసిల్లక్రైం: వెలుగుల పండుగ దీపావళి అంటేనే టపాసులతో సంబరాలు. జిల్లా ప్రజల ఆసక్తిని గమనించిన వ్యాపారులు ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ రకాల టపాసులు కొనుగోలు చేసి గోదాంలలో నిల్వ చేశారు. వాటిని విక్రయించుకునేందుకు లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో దుకాణాల ఏర్పాటుకు 60 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ పరిసరాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.
నిబంధనలు పాటిస్తేనే..
వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకునే స్థలంలో నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని పరిశీలించాకే అనుమతులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం దీపావళి కావడంతో ఆదివారం సాయంత్రం నుంచే టపాసుల విక్రయాలు మొదలుకానున్నాయి.
అధికారుల హెచ్చరిక
నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక అధికారులు హెచ్చరిస్తున్నారు. పక్కపక్కనే టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏదేని అగ్నిప్రమాదం జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని సిరిసిల్ల, వేములవాడ ఫైర్‌స్టేషన్ అధికారులు నరేందర్, అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఐదు షాపుల మధ్య కనీస స్థలాన్ని వదిలిపెట్టాలని సూచిస్తున్నారు. వ్యాపారంలో లాభాల కంటే భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తున్నారు.